Damodara Rajanarasimha : ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన పౌరులతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా ఉంది. అనారోగ్యం వల్ల ప్రజలు అప్పులపాలు కాకుండా, అవసరమైన అన్ని వైద్య సేవలు వారికి సమయానికి అందాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. వైద్యం ఉచితంగా లభిస్తుందన్న భరోసా ప్రజలకు కలగాలి. ఆ భరోసాను కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఆరోగ్యశ్రీలో 1375 వైద్య చికిత్సల ధరలను సుమారు 22 శాతం పెంచడంతో పాటు, కొత్తగా 163 రకాల చికిత్సలను చేర్చి మొత్తం చికిత్సల సంఖ్యను 1835కి పెంచింది. అదనంగా రూ.487.29 కోట్లను కేటాయించి ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రావడానికి అనుగుణంగా నెట్‌వర్క్ హాస్పిటళ్ల సంఖ్యను పెంచేందుకు అనుమతులు ఇచ్చింది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం మెరుగుపడాలంటే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనతికాలంలోనే 8 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసింది. ఇంకా 6,268 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్లు, ఎంపీహెచ్‌ఏ, ఫార్మసిస్ట్‌లు, నర్సింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు వంటి విభాగాలు ఉన్నాయి.
గత ఏడాది కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం, ప్రస్తుతం మరో 16 నర్సింగ్ కాలేజీలను ప్రారంభించింది. ఒక్కో నర్సింగ్ కాలేజీలో 60 సీట్ల చొప్పున, మొత్తం 960 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే, 28 కొత్త పారామెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి, మొత్తం 1680 సీట్లను అదనంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఉస్మానియా హాస్పిటల్ పునర్నిర్మాణాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించి, గోషామహల్‌లో 27 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఆసుపత్రిని రూ.2,700 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. అలాగే, ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల విద్యార్థుల కోసం కొత్త హాస్టల్ భవనాలకు రూ.204.85 కోట్లు కేటాయించారు.
నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) పేషెంట్లకు చికిత్స అందించేందుకు ప్రతి జిల్లాలో ఎన్‌సీడీ క్లినిక్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 50 లక్షల మంది రోగులకు ఈ క్లినిక్స్ ద్వారా వైద్యం అందుతోంది. డయాలసిస్ చికిత్సలు మరింత విస్తృతంగా అందించేందుకు కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లు మంజూరు చేయడంతో పాటు, ఇప్పటికే ఉన్న 20 డయాలసిస్ సెంటర్లలో అదనంగా 89 డయాలసిస్ మిషన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
రోడ్డు ప్రమాదాలు మరియు ఇతర అత్యవసర పరిస్థితులలో వెంటనే వైద్యసాయం అందించేందుకు ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం 15 నిమిషాల్లో ప్రమాదస్థలికి అంబులెన్స్ చేరుకునేలా కొత్తగా 213 అంబులెన్స్‌లను ప్రారంభించి, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైమ్‌ను 14 నిమిషాలకు తగ్గించింది. త్వరలో మరిన్ని అంబులెన్స్‌లను తీసుకురావాలని ప్రభుత్వ ప్రణాళిక ఉంది.
ఇన్‌ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా ఐవీఎఫ్ చికిత్సలు అందిస్తోంది. ప్రస్తుతం గాంధీ, పెట్లబుర్జు హాస్పిటళ్లలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగులకు మెడిసిన్ అందించడంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రతి జిల్లాలో ‘సెంట్రల్ మెడిసినల్ స్టోర్’ (CMS) ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 11 జిల్లాల్లో మాత్రమే ఉండగా, ఇప్పుడు 22 జిల్లాల్లో మెడిసిన్ స్టోర్లు అందుబాటులోకి వచ్చాయి.
ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేకంగా మైత్రి క్లినిక్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్లినిక్స్‌లో డాక్టర్లు, నర్సులు, కౌన్సెలర్లు అందుబాటులో ఉంటూ ట్రాన్స్‌జెండర్ సమాజానికి మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారు.
ఆహార భద్రతను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను నియమించి, ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. మెడిసిన్ తయారీ, సరఫరా లాంటి అంశాలపై నిఘా ఉంచి, ప్రజలకు నాణ్యమైన మెడిసిన్ అందించేందుకు కృషి చేస్తోంది.