వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాకుండా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావును కూడా బాధ్యుడిగా గుర్తించింది. ఆయనపై బదిలీ వేటు వేసింది. ఎంజీఎం సూపరింటెండెంట్‌గా శ్రీనివాసరావు స్థానంలో చంద్రశేఖర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై పూర్తి వివరాలు తక్షణమే నివేదిక పంపించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించింది. ప్రాథమిక రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తెలిపింది. కాగా ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు.