తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున సహాయం మంజూరు చేసింది. మొత్తం 133 కుటుంబాలకు రూ.7.95 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణశాఖ జీవో జారీ చేసింది.
అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 27 మంది రైతులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 23 మంది రైతులు, భూపాలపల్లిలో 12 మంది రైతుల కుటుంబాలకు ప్రభుత్వం విడుదల చేసిన పరిహారం అందనుంది. కాగా తెలంగాణ రాష్ట్రంలో వరదలతో పంట నష్టపోయిన వారు, అలాగే అప్పుల భారంతో పాటు మరికొన్ని కారణాల వల్ల రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.