Telangana : తెలంగాణ ప్రభుత్వం వాణిజ్య సంస్థల (షాపులు తప్పనిసరి) ఉద్యోగుల పనివేళల పరిమితిలో కీలక మార్పు చేసింది. ఉద్యోగులకోసం రోజుకు గరిష్టంగా 10 గంటలు, వారానికి గరిష్టంగా 48 గంటల పని చేయడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పరిధిలో తీసుకున్న నిర్ణయంగా, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
ప్రభుత్వం జూలై 5, 2025న జారీ చేసిన G.O.Rt.No.282 ప్రకారం, 1988లో రూపొందించిన తెలంగాణ షాపులు , ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టంలోని సెక్షన్లు 16, 17 వర్తించని అన్ని వాణిజ్య సంస్థలకు (షాపులు కాకుండా) ఈ నిబంధనలు వర్తిస్తాయి.
ప్రధాన నిబంధనలు ఇవే:
రోజువారీ పని గంటలు 10 కి మించరాదు: ఉద్యోగి రోజుకు గరిష్టంగా 10 గంటల వరకు మాత్రమే పని చేయవచ్చు. వారానికి మొత్తం పని గంటలు 48కి మించరాదు. అది మించితే ఓవర్‌టైమ్ వేతనం ఇవ్వాలి.
విశ్రాంతి సమయం తప్పనిసరి: ఉద్యోగి రోజులో 6 గంటలకు మించి పని చేస్తే, కనీసం 30 నిమిషాల విశ్రాంతి సమయం ఇవ్వాలి.
పని వ్యవధి 12 గంటల కంటే ఎక్కువ కాకూడదు: పని సమయంతో పాటు విశ్రాంతి సమయం కలిపి ఏ ఒక్క రోజులోనూ పని వ్యవధి 12 గంటల కంటే అధికంగా ఉండకూడదు.
ఓవర్‌టైమ్ పరిస్థితులు: ఓవర్‌టైమ్ పరంగా వారానికి 48 గంటలు మించి పని చేయించవచ్చు కానీ, ఏ త్రైమాసికంలోనూ 144 గంటలు మించకూడదు.
నిబంధనలు ఉల్లంఘిస్తే మినహాయింపు రద్దు: పై నిబంధనలను ఉల్లంఘించినవేళ మినహాయింపు ఉత్తర్వులను ప్రభుత్వం ఎప్పుడైనా రద్దు చేసే హక్కును కలిగి ఉంటుంది.
ఈ ఉత్తర్వులు జూలై 8, 2025 న గెజెట్‌లో ప్రచురించబడతాయి. ఈ చర్యల వల్ల కంపెనీలకు సౌకర్యవంతంగా పనిచేసే అవకాశం కలుగుతుందని, ఉద్యోగులకు కూడా సమర్థవంతమైన పని పద్ధతులు అమలులోకి వస్తాయని భావిస్తున్నారు.