Site icon NTV Telugu

CM Revath Reddy : వచ్చే 72 గంటలు అలెర్ట్‌గా ఉండాలని ఆదేశాలు

Revanth Reddy

Revanth Reddy

CM Revath Reddy : తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల సూచన నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందస్తుగా అలర్ట్‌ చేయాలని సీఎం ఆదేశించారు. “వచ్చే 72 గంటలు అలెర్ట్‌గా ఉండండి. ఎక్కడ ఏం జరిగినా వెంటనే కంట్రోల్‌ రూమ్‌ తో కమ్యూనికేషన్‌ కొనసాగించండి” అని సూచించారు.

అకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున, అవసరమైన హెలికాప్టర్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో నిరంతరం సమన్వయం కొనసాగించాలని సీఎం ఆదేశించారు. విద్యుత్‌ అంతరాయం తలెత్తకుండా మొబైల్‌ ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉంచాలని, హైదరాబాద్‌లో వరదలపై హైడ్రా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అత్యవసర సమయాల్లో ప్రజలు ఫిర్యాదు చేయడానికి టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు.

Justice : పార్కింగ్‌ కోసం 17 ఏళ్లు… చివరికి న్యాయం ఇలా..!

భారీ వర్షాల సమయంలో స్కూల్స్‌, కాలేజీలు, ఐటీ సంస్థలకు సెలవులు ప్రకటించాల్సిన అవసరం ఉంటే సంబంధిత శాఖల అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అవసరమైతే ప్రజలు బయటకు రాకుండా చర్యలు చేపట్టాలని, ప్రాణనష్టం జరగకుండా ప్రతి చర్య తీసుకోవాలని హెచ్చరించారు. “జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్న నిధులను తక్షణ సహాయం కోసం వినియోగించండి. ఇలాంటి సందర్భాల్లో వెనకా ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు” అని సీఎం స్పష్టం చేశారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, రాష్ట్రంలో ఇప్పటికే 2000 మంది డిజాస్టర్‌ రెస్పాన్స్‌ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. హెలికాప్టర్ల అవసరం ఉంటే ముందుగానే కోఆర్డినేట్‌ చేసుకోవాలని సూచించారు. గతంలో ఖమ్మంలో కలెక్టర్‌ తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎక్కువ నష్టం జరిగిందని గుర్తుచేస్తూ, ఈసారి అలాంటి పరిస్థితి రాకూడదని తెలిపారు.

మెడికల్‌, హెల్త్‌ శాఖ అధికారులు మందులు, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రమాదం జరిగే ప్రాంతాలకు ప్రజలను వెళ్లనివ్వకుండా చూడాలని, పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఆన్‌డ్యూటీ లో ఉండాలని సూచించారు. ఎఫ్‌ఎమ్‌ రేడియో, టీవీల ద్వారా ప్రజలకు అలెర్ట్‌లు పంపాలని, తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పాత భవనాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే అక్కడి నుంచి ప్రజలను తరలించాలని ఆదేశించారు. “నేను కూడా అందుబాటులో ఉంటాను. ఏం సమస్య ఉన్నా వెంటనే చెప్పండి. ఇన్‌ఛార్జ్‌ మంత్రులు కూడా అందుబాటులో ఉంటారు” అని సీఎం రేవంత్‌ భరోసా ఇచ్చారు.

Broccoli: బ్రోకలి శాండ్‌విచ్ తిని ప్రముఖ మ్యూజీషియన్ మృతి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

Exit mobile version