ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. నిన్న జనగామ వేదికగా ప్రధాని మోడీపై నిప్పులు చెరిగిన ఆయన.. ఇవాళ భువనగిరి బహిరంగసభలోనూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ కొత్త కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు.. అనంతరం రాయగిరిలో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఎనిమిదేళ్ల పాలనలో బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు.. డబ్బాల్లో రాళ్లేసి లోడలోడ ఊపినట్టు వొర్రుడు తప్పా.. ఏం మంచి పని చేసింది.. మంచి పనైతే మనకు తెల్వదా.. మనం ప్రజలం కాదా.. ఒక వేళ మంచిపని చేస్తే మనదాకా రాదా.. ఏ రంగానికి చేశారు..? అంటూ నిలదీసిన ఆయన.. వ్యవసాయ రంగానికా? దళితవర్గానికా? గిరిజన వర్గానికా? బీసీ ప్రజలకా? చేనేత కార్మికులా? గీత కార్మికులా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.. ఇక, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఏ కేసీఆర్ నీ సంగతి చూస్తం అంటున్నారని.. చూసేదేంది సంగతి తోకమట్టనా.. చూసేది కేసీఆర్ సంగతేనా.. కేసీఆర్ భయపడుతడా.. భయపడితే తెలంగాణ వచ్చేదా? అంటూ ఫైర్ అయ్యారు.
Read Also: IPL 2022 Auction: దుమ్ములేపిన ఇషాన్ కిషన్.. రూ.15.25 కోట్లు..
తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. చూసి బీజేపీ ఓర్వలేకపోతుందని మండిపడ్డారు కేసీఆర్.. తెలంగాణకు ఇవాళ పెట్టుబడులు ఎలా వస్తున్నాయి..? ఎందుకు వస్తున్నాయి..? ఏ కారణం చేత వస్తున్నాయి..? అని ప్రశ్నించిన ఆయన.. బీజేపీ అధికారంలో ఉంటే.. మత కల్లోలం రేగితే.. మత పిచ్చి లేస్తే.. పొద్దున లేస్తే లాఠీచార్జీలు.. లూఠీలు.. కర్ఫ్యూలు, ఫైరింగ్‌లుంటే ఎవరైనా వచ్చేవారా? లా అండ్ ఆర్డర్ బాగుంటేనే కదా పెట్టుబడులు వచ్చేది అన్నారు.. ఫ్యాక్టరీలు వస్తున్నాయి.. నరేంద్ర మోడీ సిగ్గుపడాలి అంటూ వ్యాఖ్యానించిన కేసీఆర్.. ఏ దేశం ఎవని అయ్య సొత్తు కాదు.. నువ్వు నాశనం చేస్తే చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోవడానికి అంటూ గర్జించారు.. పోరాటంలో అంతా కలిసి కొట్టాడాం.. తెలంగాణ సాధించుకున్నాం అన్నారు కేసీఆర్.. వచ్చిన తెలంగాణను కడుపుకట్టుకొని, నోరుకట్టుకొని మంచినీళ్లు, సాగునీళ్లు, కరెంట్.. ఇలా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటుంటే.. జరజర ఊళ్లు దమ్ముతీసుకుంటే కండ్లు మండుతున్నయా?.. ఈ దేశంలో ఏ బీజేపీ మోగోడు సమాధానం చెబుతడో నాకు చెప్పాలి అని సవాల్ చేశారు. ఈ దేశంలో 4లక్షల మెగావాట్ల కరెంటు ఉన్నది.. దేశంలో వాడేది 2లక్షల మెగావాట్ల కంటే ఎక్కువ దాటది. ఇది ఎవరి తెలివితక్కువ తనం. దేశాన్ని పాలించే నరేంద్ర మోదీ తెలివితక్కువ తనం కాదా? అంటూ ప్రశ్నించారు కేసీఆర్.. కేంద్రం ప్రభుత్వం బ్యాడ్ పవర్ పాలసీకాదా? ఎవరు బాధ్యులు దీనికి. దేశంలో 65వేల టీఎంసీలు నీళ్లు ఉన్నయి.. ఇది నా లెక్క కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ బోర్డు లెక్కేనన్న కేసీఆర్.. ఇవాళ్టి వరకు 35వేల టీఎంసీలకు మించి వాడలే. కానీ దేశంలో తాకులాటలు.. పీకులాటలు.. కావేరి, గోదావరి మీద కొట్లాట నిత్యం జరుగుతూనే ఉన్నాయి.. ఇది కేంద్ర ప్రభుత్వ తెలివితక్కువ తనం కాదా? అని ప్రశ్నించారు.
మరోవైపు, కర్ణాటకలో జరుగుతోన్న ఆందోళనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్.. ఐటీ రంగంలో దేశానికి సిలికాన్ వ్యాలీ బెంగళూరు సిటీ కర్నాటక రాష్ట్రం.. దాని తర్వాత స్థానంలో హైదరాబాద్ ఉందన్న ఆయన… ఇప్పుడు కర్నాటకలో ఏం జరుగుతుందో చూస్తున్నాం.. ఆడ పిల్లలు, మన బిడ్డల మీద రాక్షసుల్లా ప్రవర్తించవచ్చునా..? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరును మతపిచ్చి లేపి కశ్మీర్‌లా తయారు చేస్తున్నారని మండిపడ్డ కేసీఆర్.. ఇది అవసరమా ఈ దేశానికి.. దేశంలో ఉండే సహృద్భావ వాతావరణం నాశనమైతే ఎవరు పెట్టుబడులు పెడుతరు? ఎవరికి ఉద్యోగాలు వస్తాయి? అని నిలదీశారు.. ఇప్పటికే బీజేపీ పరిపాలనలో నష్టపోయాం అన్నారు.. దేశంలో నిరుద్యోగ సంఖ్య పెరిగింది నిజం కాదా? దేశంలో పారిశ్రామిక ఉత్పత్తులు పడిపోయిన మాట వాస్తవం కాదా? సెప్టెంబర్‌లో 4.4శాతం, అక్టోబర్‌లో 4శాతం, నవంబర్‌లో 1.4శాతం, డిసెంబర్‌లో 0.4శాతం.. దీన్ని ఏమంటారు మోదీ గారు? అంటూ ప్రశ్నించిన కేసీఆర్.. ఇది మీ గొప్ప పరిపాలనకు తార్కాణమా? అంటూ ఎద్దేవా చేశారు. ఇక, మోడీ మెడ మీద కత్తి పెట్టి బాయికి, బోరుకు మీటర్ పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్.. మోడీ దోస్తుకు లాభం చేసేందుకు పెట్టిన పేరు… విద్యుత్ సంస్కరణ.. ఆ పేరుతో రైతులను గెలుక్కుంటున్నారన్న ఆయన.. మోడీని తరిమి తరిమి కొట్టాలి.. సిగ్గు పడాలి మోడీ.. దేశం ఎవరి సొత్తు కాదు… నాశనం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు..