Ponnam Prabhakar : ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చెక్ పోస్టులను రద్దు చేస్తూ జీవో జారీ చేసినట్లు ప్రకటించారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అన్ని లావాదేవీలు పారదర్శకంగా ఆన్లైన్‌లో జరగాలనే ఉద్దేశంతో రెండు నెలల క్రితం నిర్ణయం తీసుకుని, ఈరోజు నుండి చెక్ పోస్టులు పూర్తిగా మూసివేస్తూ అమలు చేస్తున్నామని తెలిపారు. రవాణా వ్యవస్థలో ఆధునికత, పారదర్శకతను తీసుకురావడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని అన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వాహన్ అమలు కొనసాగిస్తోందని, త్వరలోనే సారథి సిస్టమ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రవాణా శాఖలో కృత్రిమ మేధ (AI) టెక్నాలజీని వినియోగిస్తూ పారదర్శక వ్యవస్థను నెలకొల్పుతున్నామని చెప్పారు. కార్యాలయాల్లో రెగ్యులర్‌గా వచ్చే దరఖాస్తుదారుల వివరాలు స్వయంచాలకంగా రికార్డ్ అవుతూ, హెడ్ ఆఫీస్‌కు అలర్ట్‌లు పంపే విధంగా సిస్టమ్ అమలు చేస్తున్నామన్నారు. అదే సమయంలో వాహనాలకు సంబంధించిన రికార్డులు, టాక్స్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ వంటి అంశాలను ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించే చర్యలు తీసుకున్నామని వివరించారు.
ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్స్) పాలసీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.577 కోట్ల ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. ఇవి వాహనాల అమ్మకాల వాటా 0.03 శాతం నుండి 1.13 శాతానికి పెరిగిందని మంత్రి చెప్పారు. ఢిల్లీలో లాగా కాలుష్య పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలుగా తెలంగాణ ఇవి పాలసీని రూపొందించిందని వివరించారు. నగరంలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలకు, LPG, CNG ఆటోలకు 10 వేల చొప్పున, అలాగే 25 వేల రిట్రోఫిటింగ్ ఆటోలకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. పాత వాహనాల స్థానంలో ఇవి వాహనాలను ప్రోత్సహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా ఆధునిక రవాణా వాతావరణాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు.
రోడ్ సేఫ్టీపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు రవాణా శాఖ పలు కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి వివరించారు. నాచారం, కరీంనగర్‌లలో రోడ్ సేఫ్టీ చిల్డ్రన్ అవేర్‌నెస్ పార్క్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. కాలేజీల్లో రోడ్ సేఫ్టీ క్లబ్బులు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో అవగాహన పెంచుతున్నామని చెప్పారు. ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్‌ను తీసుకువచ్చే ప్రణాళిక ఉందని తెలిపారు.
గత 10 సంవత్సరాల్లో రవాణా శాఖలో అవినీతి మూలాల్లా ఏర్పడిందని విమర్శించిన మంత్రి, ఇప్పుడు పారదర్శక వ్యవస్థను తీసుకువస్తున్నామని తెలిపారు. బ్రోకర్ వ్యవస్థను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 63 కేంద్రాల్లో కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతోందని చెప్పారు. 112 మంది AMVI లను నియమించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పోలీస్, ఆర్టీసీతో పాటు ఇతర శాఖల్లో ఉన్న పాత వాహనాలను స్క్రాప్‌కి పంపించాలని ఆదేశించామని వివరించారు.
చెక్ పోస్టులను రద్దు చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కేబినెట్‌లో ఆమోదం పొందినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాబోయే కాలంలో మొత్తం ఆదాయాన్ని ఆన్లైన్ ద్వారా సేకరించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.7 కోట్ల వాహనాలు ఉన్నాయని, రోడ్ ప్రమాదాలు తగ్గించేందుకు పలు సంస్కరణలు అమలు చేస్తున్నామని వివరించారు. వాహన్, సారథి సిస్టమ్‌ల ద్వారా తెలంగాణ కూడా దేశంలోని మిగిలిన 28 రాష్ట్రాలతో సమానంగా సాంకేతికతలో ముందంజ వేస్తుందని తెలిపారు.
“గత పదేళ్లలో తెలంగాణ వాహన్, సారథి ప్లాట్‌ఫారమ్‌లలో ఎందుకు చేరలేదో తెలియదు. ఇప్పుడు మేము చేరాం, డేటా ట్రాన్స్‌ఫర్మింగ్ జరుగుతోంది. వాహన్ ఇప్పటికే అమల్లో ఉంది, సారథిని త్వరలో అమలు చేస్తాం. ఇకపై రవాణా శాఖలో అవినీతి లేదా అనధికార వ్యవహారాలకు చోటు ఉండదు,” అని మంత్రి స్పష్టం చేశారు. చెక్ పోస్టుల రద్దు వల్ల అక్రమ రవాణా జరగకుండా ఎన్ఫోర్స్‌మెంట్‌ను మరింత బలోపేతం చేస్తున్నామని అన్నారు.