Telangana BJP Leaders Fires On CM KCR After Draupadi Murmu Won Elections: భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము భారీ మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో బీజేపీ వర్గీయులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలకు తమదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ.. కేసీఆర్‌కి ఇది చీకటి రోజు అని పేర్కొన్నారు.
గిరిజన మహిళకు మద్దతివ్వకుండా టీఆర్ఎస్ చరిత్ర ద్రోహిగా మిగిలిపోయిందని, ద్రౌపది ముర్ముకు ప్రతిపక్షాలు ఓటు వేయకుండా కేసీఆర్ అడ్డుకున్నారని, అందుకు ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అని, 75ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో తొలిసారి గిరిజన బిడ్డ రాష్ట్రపతి కావడం గొప్ప విషయమని ఆనందం వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవకాశాలు కల్పిస్తున్నారని.. రాష్ట్రపతిగా 25న ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ద్రౌపది ముర్ము చిత్ర పటంతో ర్యాలీలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కూడా కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఎనిమిదేళ్లుగా గిరిజనులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు భూములు గుంజుకుంటూ.. కేసులు పెడుతూ, జైలుకు పంపిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ చెప్పింది చేయరని, కానీ మోదీ మాత్రం మోదీ చెప్పకుండానే అన్ని చేస్తున్నారన్నారు. మొట్ట మొదటిసారిగా అట్టడుగు గిరిజన మహిళకు మోదీ రాష్ట్రపతిగా అవకాశం కల్పించారని, అసలు గిరిజనులు రాష్ట్రపతి అవుతారని ఎవ్వరూ ఊహించలేదని, ప్రతి గిరిజన బిడ్డ ఈ రోజు పండగ జరుపుకుంటోందన్నారు.
ఇదే సమయంలో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ సైతం కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాటిచ్చి కేసీఆర్ విస్మరించారని.. ఆయన దళిత, గిరిజన బిడ్డలను ఓటు బ్యాంకుగా చూడటం ఆపేసి వాళ్లకు ఓటు వేయాలని చెప్పారు. ఏ హామీ ఇవ్వకుండానే మోదీ ఓ ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేశారని.. మైనార్టీ, ఎస్సి, ఎస్టీలను రాష్ట్రపతి చేసిన ఘనత బిజెపిదేనన్నారు. కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎదగడం గొప్ప విషయమని, ఇది గిరిజన జాతికి సంతోషకరమైన రోజు అని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.