అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటి తన హామీలను అమలు చేస్తూ వస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం అనంతరం మహిళలకు కోసం తెచ్చిన మహాలక్ష్మి పథకంలోని ఫ్రీ బస్ హామీని అమలులోకి తెచ్చింది. దీంతో మహిళా ప్యాసింజర్స్‌తో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా ఫ్రీ బస్ పథకంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది మహిళలకు కలిసి వచ్చినా ఆటో డ్రైవర్లను మాత్రం దెబ్బతీస్తోంది. ఈ పథకం వల్ల మహిళలు ఎవరూ ఆటోల్లో ప్రయాణించడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు.
Also Read: Revanth Reddy: ఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
సాధారణంగా తమ ఆటోల్లో ఎక్కువగా ప్రయాణించేది మహిళలేనని, ఇప్పుడు ఈ పథకం వల్ల తాము నష్టపోతున్నామని వాపోతున్నారు. తమ ఉపాధి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో మంగళవారం ఆటో డ్రైవర్ల యూనియన్ పెద్ద ఎత్తున్న ఆందోళనకు దిగింది. తమని ప్రభుత్వం ఆదుకోవాలంటూ నిరసన వ్యక్తం చేస్తోంది. కాగా రాష్ట్రంలో ఆటో నడుపుతూ వేలాదిమంది డ్రైవర్లు తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ తదితర మండలాల్లో సుమారు 1000కి పైగా ఆటో, జీపులు ఉన్నాయి. నిత్యం వందలాది మంది మహిళా ప్రయాణికులు ఈ వాహనాల్లో వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తుంటారు.
Also Read: Bussiness Idea : డిమాండ్ తగ్గని బిజినెస్ ఇదే.. అదిరిపోయే లాభాలు..
అయితే ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళలు ఆటోల్లో ప్రయాణించడం మానేశారు. ఈ ఉచిత ప్రయాణం బాగానే ఉన్నా ప్రయాణికులపై ఆధారపడి ఉన్న తమను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఏదోరకంగా ఉపాధి అందించేలా చూడాలని ఆటో డ్రైవర్ల యూనియన్ ప్రభుత్వాన్ని కోరుతుంది. అప్పు చేసి మరీ ఫైనాన్స్తో ఆటోలను కొనుగోలు చేశామని, ఈ ఉచిత ప్రయాణంతో ప్రయాణికులు రాక ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తోందని అంటున్నారు. మరోవైపు కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రమంతటా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.