కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్–2026 తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నిరాశ కలిగించింది. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాది రైతుల ఆశలను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని వ్యవసాయ మంత్రి తుమ్మల తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకం పెంపు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీని వలన రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం ఏర్పడే అవకాశం ఉంది. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించాల్సిన బదులు, దిగుమతులకు అనుకూలంగా కేంద్రం వ్యవహరించడం దురదృష్టకరమని మంత్రి అన్నారు.
పసుపు బోర్డు ఏర్పాటుకు నిధుల కేటాయింపు లేకపోవడం, అలాగే పసుపును High Value Cropగా గుర్తించకపోవడం తెలంగాణ పసుపు రైతులకు తీవ్ర నిరాశను కలిగించింది. లక్షలాది మంది పసుపు రైతులు ఎదురుచూస్తున్న Dedicated Funds గురించి బడ్జెట్‌లో స్పష్టమైన ప్రకటన లేకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నార్థకంగా మార్చిందని పేర్కొన్నారు. అదేవిధంగా, కొబ్బరి (కోకనట్) బోర్డు ఏర్పాటు విషయమై కూడా ఎలాంటి ప్రకటన లేకపోవడం రాష్ట్ర రైతాంగానికి మరో ఎదురుదెబ్బగా మారిందన్నారు. ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉందన్న సంకేతాలు రైతులపై మరింత భారం మోపనున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను తగ్గించే చర్యలు బడ్జెట్‌లో పూర్తిగా లేవని మంత్రి తెలిపారు.
రైతులకు అత్యంత కీలకమైన MSP (కనీస మద్దతు ధర)కు చట్టబద్ధ హక్కు కల్పించడంలో కేంద్రం మరోసారి విఫలమైంది. దీని వలన రైతుల ఆదాయ భద్రతపై అనిశ్చితి మరింత పెరిగిందన్నారు. వ్యవసాయ మార్కెటింగ్, ధరల స్థిరీకరణ, మార్కెట్ సంస్కరణలపై స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడం కేంద్ర బడ్జెట్ లోని ప్రధాన లోపమని అన్నారు. దేశీయ నూనెగింజల రైతులను రక్షించేలా తినుబండార నూనెలపై ఇంపోర్ట్ డ్యూటీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. కేంద్ర పథకాల ఏకీకరణ పేరుతో తెలంగాణకు వచ్చే నిధుల్లో కోత విధించడం రాష్ట్రానికి తీరని అన్యాయం అని మంత్రి స్పష్టం చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యం ఇప్పటికీ మాటలకే పరిమితమైందని, దానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ బడ్జెట్‌లో ఎక్కడా కనిపించలేదన్నారు.
వ్యవసాయ రంగంలో బడ్జెట్‌లో ప్రస్తావించదగిన ఏకైక అంశం AI ఆధారిత కార్యక్రమాల ప్రస్తావన మాత్రమేనని, అయితే ధర భద్రత, మార్కెట్ భరోసా లేకుండా కేవలం AI రైతు సమస్యలకు పరిష్కారం కాదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. మొత్తంగా, కేంద్ర బడ్జెట్–2026 తెలంగాణ రైతాంగానికి ఆశలు నింపడంలో పూర్తిగా విఫలమైందని, రాష్ట్రానికి ప్రత్యేకంగా యెటువంటి ప్రత్యేక ప్రయోజనం లేకుండా రూపొందించబడిందని మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
