తెలంగాణ బీజేపీలో సంస్థాగత ఎన్నికలు రానున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎవరికివారే తమకు పదవులు వరించనట్లు ఊహాగానాలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా నేతలతో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ.. ఎవరికీ సీట్లు ఖరారు కాలేదని స్పష్టం చేశారు. తమకే సీటు అనే భ్రమలో ఉండకూడదని ఆయన తెలిపారు. పని చేసే వారిని సర్వేల ఆధారంగా సీట్లు లభిస్తాయని, నెల రోజల్లో సంస్థాగత పోస్ట్ లను భర్తీ చేయాలన్నారు. అన్ని కమిటీలను వేయాలని, నెల తరవాత పూర్తి స్థాయిలో కార్యక్షేత్రంలోకి దిగాలన్నారు. కింది స్థాయిలో చేరికలపై దృష్టి పెట్టండని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా చేరికల కమిటీలు వేయండని, పెద్ద వాళ్ళు జాయిన్ అయ్యేది ఉంటే రాష్ట్ర పార్టీకి పంపించండని ఆయన వివరించారు. చేరే వారిని ఆపొద్దని ఆయన వెల్లడించారు. ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. పార్టీ బలోపేతనానికి కృషి చేసిన వారిని వెతుక్కుంటూ సీటు వస్తుందన్నారు.