హైదరాబాద్ నగరం శివారులోని ముచ్చింతల్‌లో రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకల నేపథ్యంలో తపాలా శాఖ ప్రత్యేకంగా పోస్టల్ కవర్‌ను రూపొందించింది. ఈ మేరకు తపాలా శాఖ ముద్రించిన పోస్టల్ కవర్‌ను చినజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం సమతా మూర్తి విగ్రహం ఎదుట తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2,500 మంది కళాకారులు ప్రత్యేక ప్రదర్శన చేపట్టారు.
మరోవైపు బుధవారం సాయంత్రం 5 గంటలకు సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలకు అంకురార్పణ జరిగింది. చినజీయర్ స్వామి యాగశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల అంకురార్పణ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. అంతకుముందు రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా యాగశాలలో వాస్తు శాంతి పూజను వేదపండితులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.