Srushti IVF Center : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై సంచలనం రేగుతోంది. ఒక చిన్నారికి క్యాన్సర్ రావడంతో తల్లిదండ్రులకు కలిగిన అనుమానం, ఆసుపత్రి నిర్వాకం వెనుక ఉన్న దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. పుట్టిన బిడ్డ తమ వీర్య కణాలతోనే కలిగిందా లేదా అనే అనుమానం డీఎన్ఏ పరీక్షలతో నిజమైంది. ఇది పెద్ద ఎత్తున అక్రమాలకు, అనైతిక పద్ధతులకు అద్దం పడుతోంది.
టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం సృష్టి సెంటర్‌ను ఆశ్రయించిన దంపతులకు మగబిడ్డ పుట్టాడు. అయితే, బిడ్డ ఎదుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. కొన్ని రోజుల క్రితమే బాబుకు క్యాన్సర్ అని తేలడంతో దంపతులు షాక్‌కు గురయ్యారు. దీంతో మరో డాక్టర్‌ను సంప్రదించి డీఎన్ఏ టెస్ట్ చేయించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బిడ్డ డీఎన్ఏ తమ వీర్యకణాలతో సరిపోలడం లేదని, మరొకరి వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆగ్రహించిన దంపతులు పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేయించారు.
ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. తొమ్మిదేళ్ల క్రితం, అంటే 2016లో కూడా NTV చేసిన స్పై ఆపరేషన్ కారణంగా ఈ హాస్పిటల్‌ను అధికారులు సీజ్ చేశారు. అప్పుడు అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో మూసివేసిన ఈ సెంటర్‌ను, డాక్టర్ నమ్రత మళ్ళీ అక్రమంగా అనుమతులు పొంది నిర్వహిస్తున్నట్లు ఇప్పుడు వెల్లడైంది.
సికింద్రాబాద్‌లో కేసు నమోదైన వెంటనే, వైజాగ్‌లో ఉన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో కూడా పోలీసులు దాడులు నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్, వైద్య శాఖల ఉన్నతాధికారులు రెండు గంటలకు పైగా తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో అక్రమంగా పెద్ద ఎత్తున వీర్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. కొందరు యువకులకు డబ్బు ఆశ చూపి అక్రమ పద్ధతిలో వీర్యం సేకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ మొత్తం వ్యవహారానికి కీలక సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ నమ్రత ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నట్లు తెలిసింది. ఎవరైనా దంపతులు టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం వస్తేనే, విజయవాడ నుంచి వచ్చి చికిత్సలు అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు డాక్టర్ నమ్రతను విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు తీసుకువచ్చారు.
సంతానం కోసం ఆశపడే దంపతుల నమ్మకాన్ని ఆసరా చేసుకొని వారి జీవితాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఫర్టిలిటీ క్లినిక్‌ల పారదర్శకత, నియంత్రణపై మరోసారి చర్చను రాజేసింది.