Srushti Fertility Scam : హైదరాబాద్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు చెందిన డాక్టర్ నమ్రతపై ఘోర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పేద దంపతుల వద్ద ఫ్రీగా ఆడపిల్లలను తీసుకుని, సరోగసి పేరుతో విక్రయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆడపిల్లలను పెంచే ఆర్థిక స్థోమత లేని కుటుంబాల నుండి ఏజెంట్ల సహకారంతో పిల్లలను సేకరించిన నమ్రత, మగ పిల్లలయితే ఒక్కొక్కరిని లక్ష రూపాయలకు కొనుగోలు చేసి సరోగసి పేరుతో అమ్మినట్లు సమాచారం.
డాక్టర్ నమ్రత దగ్గరకు వచ్చే దంపతులకు సరోగసి పేరుతో చికిత్స అందిస్తున్నట్టుగా చూపించేది. గర్భధారణ ప్రక్రియ జరుగుతోందని నమ్మించేలా ప్రతినెల స్కానింగ్లు, బిడ్డ ఎదుగుదల రిపోర్టులు తయారు చేసి పంపించేది. వాస్తవానికి అవి నకిలీ రిపోర్టులేనని దర్యాప్తులో తేలింది. “మీ బిడ్డ వేరే మహిళ గర్భంలో పెరుగుతున్నాడు” అంటూ ప్రతి నెల చికిత్స పేరుతో మూడు నుండి నాలుగు లక్షలు వసూలు చేసేది.
బిడ్డ ఆరోగ్యంగా పుట్టేలా ప్రత్యేక మందులు, ట్రీట్మెంట్ల పేరుతో కూడా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఈ విధంగా ఒక్కో జంట దగ్గర నుండి 35 లక్షల నుండి 50 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్, డాక్టర్ నమ్రత పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.