వినాయక చవితి అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది బాలాపూర్ గణేష్.. బాలాపూర్ గణేష్ శోభయాత్ర ప్రారంభం అయిన తర్వాతే.. హైదరాబాద్‌లో వినాయక విగ్రహాలు మంఠపాల నుంచి గంగమ్మ ఒడికి కదిలి వెళ్తుంటారు..? ఇక, బాలాపూర్ బొజ్జ గణపతికి మరో ప్రత్యేకత ఉంది.. అదే లడ్డూ వేలం.. ప్రతీ ఏడాది కొత్త రికార్డు సృష్టిస్తూ వస్తున్న గణేష్ లడ్డూ.. ఈ సారి ఎంత పలకనుంది? అనేది ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.. చివరి పూజ జరిగిన తర్వాత.. బాలాపూర్‌లో ఊరేగింపు నిర్వహిస్తుంది ఉత్సవ సమితి.. ఆ తర్వాత బాలాపూర్ బొడ్రాయి దగ్గర వేలం పాట సాగుతోంది… బాలాపూర్ లడ్డూ చాలా ఫేమస్. ఈ లడ్డూను దక్కించుకుంటే తమకు తిరుగుండదని భక్తులవిశ్వాసం. అందుకే ప్రతియేటా దీని ధర దూసుకుపోతోంది. బాలాపూర్ వాసులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందినవారు కూడా లడ్డూ వేలంలో పాల్గొంటారు.. అయితే, ముందుగా డబ్బులు డిపాజిట్ చేసినవారినే లడ్డూ వేలంలోకి అనుమతి ఇస్తుంది బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి… ఆ వేలంలో వచ్చిన డబ్బును పలు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.
Read Also: Balapur Ganesh Shobha Yatra- 2022: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం, శోభాయాత్ర లైవ్
ప్రతీ ఏడాది తన రికార్డును తాకే బ్రేక్ చేస్తూ వస్తున్నారు బాలాపూర్ గణపతి.. ఈసారి ఆ లడ్డూ ధర ఎంత పలుకుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. భాగ్యనగరంలో అన్ని లడ్డూల కంటే బాలాపూర్ లడ్డూకు ఉన్న క్రేజే వేరు. ఈ గణేషుడి లడ్డూ బరువు 21కిలోలు మాత్రమే. ఈ ప్రసాదం క్వాంటిటీ తక్కువే కాంపిటేషన్ మాత్రం చాలా ఎక్కువ. ఈ మహాప్రసాదం కోసం ప్రముఖులు సైతం పోటీపడతారు. ఈ లడ్డూను దక్కించుకుంటే విఘ్న నాయకుడి కటాక్షం దక్కుతుందన్నది భక్తుల సెంటిమెంట్. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే.. అసలు గణేష్ లడ్డూ వేలాన్ని ప్రారంభించిందే ఇక్కడ.. బాలాపూర్‌లో వినాయకుడికి లడ్డూను నైవేద్యంగా పెట్టే సాంప్రదాయం 1980 నుంచి ప్రారంభమైనా.. 1994లో వేలం పాట ప్రారంభించారు.. తొలిసారి కొలను మోహన్ రెడ్డి.. రూ.450కు వేలంలో కొనుగోలు చేశాడు.. 1995లోను ఆయనే రెండోసారి రూ.4,500కు లడ్డూను దక్కించుకున్నాడు. ఇక కొలను కృష్ణారెడ్డి 1996లో 18వేలకు, 97లో 28 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నాడు. 1998లో మరోసారి లడ్డూ కొలను మోహన్‌రెడ్డికి దక్కింది. ఆ సంవత్సరం వేలంలో 51వేల ధర పలికింది. 1999లో కల్లెం ప్రతాప్ రెడ్డి 65వేలకు, 2000లో కల్లెం అంజిరెడ్డి 66వేలకు, 2001లో రఘునందన్ చారి 85వేలకు లడ్డూను దక్కించున్నారు.
ఇప్పుడు గల్లీ గల్లీలో వినాయకుడి లడ్డూలను వేలం వేస్తున్నా.. దాని ఆధ్యుడు మాత్రం బాలాపూర్ గణపతి… 1994లో గణేష్ లడ్డూ వేలం ప్రారంభమైన తర్వాత.. క్రమంగా ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు కూడా లడ్డూ వేలం పాట పాకింది.. 2002లో బాలాపూర్ వినాయకుడి లడ్డూ ధర తొలిసారి లక్ష రూపాయలు దాటింది. ఆ ఏడాది లక్షా 5వేలకు లడ్డూను దక్కించుకున్నారు కందాడ మాధవ రెడ్డి. 2003లో చిగిరింత బాల్ రెడ్డి లక్షా 55వేలకు, 2004లో కొలను మోహన్ రెడ్డి 2లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డూను గెల్చుకున్నారు. 2005లో ఇబ్రహీం శేఖర్ 2లక్షల 8వేలకు దక్కించుకోగా… 2006లో చిగిరింత తిరుపతి రెడ్డి లడ్డూ ధరను 3లక్షలకు పెంచేశారు. అప్పటివరకు వేలల్లో పెరిగిన లడ్డూ ధర 2007 నుంచి లక్షల్లో పెరిగింది. 2007లో రఘునందన్ చారి 4 లక్షల 15 వేలకు అంటే అంతకుముందు ఏడాదికంటే ఏకంగా లక్షా 15 వేలు అధికంగా పాడి లడ్డూను గెల్చుకున్నారు. 2008లోనూ కొలను మోహన్ రెడ్డి 5లక్షల 7వేలకు మరోసారి లడ్డూను దక్కించుకున్నారు. 2009లో 5లక్షల 15వేలకు బాలాపూర్ లంబోదరుడి ప్రసాదాన్ని సరిత దక్కించుకోగా… 2010లో కొడాలి శ్రీధర్ బాబు 5లక్షల 35వేలకు, 2011లో కొలన్ బ్రదర్స్ 5 లక్షల 45వేలకు సొంతం చేసుకున్నారు. ఇక 2012 నుంచి ఈ లడ్డూ రేట్ ఏకంగా 2లక్షలు జంప్ అయింది. ఆ సంవత్సరం పన్నాల గోవర్ధన్ రెడ్డి 7లక్షల 50వేలకు దక్కించుకోగా… 2013లో తీగల కృష్ణారెడ్డి మరో 2లక్షలు పెంచేసి 9లక్షల 26వేలకు సొంతం చేసుకున్నాడు. 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 9లక్షల 50వేలకు వేలం పాడగా.. 2015లో కొలను మదన్ మోహన్ రెడ్డి 10 లక్షల 32వేలకు లడ్డూను గెలుచుకున్నాడు. ఇక 2016లో ఏకంగా 4లక్షలు పెంచిన స్కైలాబ్ రెడ్డి.. 14లక్షల 65వేలకు లడ్డూను దక్కించుకున్నాడు. 2017లో నాగం తిరుపతిరెడ్డి 15లక్షల 60వేలకు, 2018లో శ్రీనివాస్ గుప్తా 16లక్షల 60వేలకు, 2019లో కొలను రామిరెడ్డి 17లక్షల 67వేలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు.
ప్రతియేటా ఎంతో ఉత్సాహంగా జరిగే ఈ లడ్డూ వేలం పాటపై కరోనా ప్రభావం పడింది.. కరోనా మహమ్మారి కారణంగా.. 2020లో లడ్డూ పాట వేలాన్ని రద్దు చేసింది బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి.. ఇక, 2021లోనూ తనకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని నిరూపించుకున్నారు బాలాపూర్ గణేష్.. ఈ ఏడాది రూ.18.90 లక్షలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు ఏపీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, నాదర్‌గుల్‌కు చెందిన మర్రి శషాంక్‌రెడ్డి.. మొత్తంగా రూ.450తో ప్రారంభమై.. రూ. 18.90 లక్షలకు చేరిన బాలాపూర్ గణపతి లడ్డూ.. ఈ సారి ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.. ఇక, ఈసారి వేలంలో మొత్తం తొమ్మిది మంది పాల్గొంటున్నారు… ఇప్పటికే ఒక్కొక్కరు రూ.19 లక్షలు డిపాజిట్ చేశారు… వేలంలో గణేష్ లడ్డూను గెలుచుకున్నవారి దగ్గర ఆ మొత్తాన్ని తీసుకుని.. మిగతావారికి తిరిగి చెల్లించనున్నారు నిర్వహకులు.
సేవలోనూ ముందున్న బాలాపూర్ గణేష్ ఉత్సవసమితి..
ప్రతీ ఏడాది గణేష్ వేలం పాట ద్వారా వచ్చే సొమ్మును పలు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.. ఇప్పటి వరకు జరిగిన లడ్డూ వేలం పాటలు.. లడ్డూ దక్కించుకున్నవారు.. ఎంతకు వేలంలో కొనుగోలు చేశారు అనే వివరాలను వారి ఫొటోలతో సహా.. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి.. ఇప్పటి వరకు ఆ సొమ్మును ఎలా ఖర్చు చేశారన్న వివరాలను కూడా ఆ పక్కనే డిస్‌ప్లే చేశారు.. హనుమాన్ మందిరం, లక్ష్మీ గణపతి మందిరానికి రూ.28.55 లక్షలు, గణేష్ మండపం కోసం 130 గజాల స్థలానికి రూ.66.50 లక్షలు, బాలాపూర్ హైస్కూల్ కోసం రూ.1.45 లక్షలు, వేణుగోపాలస్వామి ఆలయం అభివృద్ధికి రూ.1.12 లక్షలు, మహబూబ్‌నగర్ వదర బాధితుల సహాయం కోసం రూ.లక్ష, పోచ్చమ్మ మందిరం కోసం రూ. 30,59,970, గణేష్ చౌక్‌కు రూ. 90 వేలు, శివాలయంల అభివృద్ధికి రూ.1.36 లక్షలు, మహంకాళి మందిరానికి రూ.8.55 లక్షలు, మల్లన్న మందిరానికి రూ.లక్ష, బాలాపూర్‌లో సీసీ కెమెరాల కోసం రూ.75 వేలు, కంఠమహేశ్వర స్వామి మందిరం కోసం రూ.3 లక్షలు ఇలా మొత్తంగా కోటి 44 లక్షల 77 వేల 970 రూపాయలు ఖర్చు చేసినట్టు వెల్లడించారు నిర్వాహకులు..