SIT Officials Investigating Ramachandra Bharati Background: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు పెంచింది. నిందితుల వెనుక ఎవరున్నారనే కూపీ లాగుతున్నారు. ఆల్రెడీ కస్టడీలోకి తీసుకొని నిందితుల్ని ప్రశ్నించిన సిట్ అధికారులు.. వారు ఇచ్చిన సమాచారంతో పాటు లభ్యమైన ఇతర వివరాల ఆధారంగా విచారణ చేపట్టారు. కొన్ని రోజుల క్రితం నిందితుడు నందకుమార్ కేంద్రంగా దర్యాప్తు చేసిన అధికారులు.. ఈ క్రమంలోనే విలువైన సమాచారాన్ని సేకరించారు. అతని అక్రమాస్తులపై కూడా కొరడా ఝుళపించారు. ఇప్పుడు రామచంద్ర భారతి కేంద్రంగా విచారణ చేస్తున్నారు. గడిచిన రెండేళ్లలో రామచంద్ర భారతి ఎక్కడెక్కడ వెళ్ళాడు, ఎవరెవరుని కలిశాడు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. ఆల్రెడీ అతని ఫోన్‌లో బీజేపీకి సంబంధించిన అనేకమంది నేతలతో దిగిన ఫోటోలను రికవరీ చేశారు. ఈ నేపథ్యంలోనే మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక, మహారాష్ట్రలో ప్రభుత్వాలు పడిపోయిన సమయంలో.. కొంతమంది కేంద్రమంత్రుల్ని రామచంద్రభారతి కలిసినట్టు సిట్ అధికారులు గుర్తించారు.
మరోవైపు.. ఈ కేసులో ముగ్గురికి లుకౌట్ నోటీసులు జారి అయ్యాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ బీడీజేఎస్ అధినేత తుషార్, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలపై సిట్ లుకౌట్ నోటీసులు విడుదల చేసింది. సోమవారం నాడు విచారణకు హాజరుకాకపోవడం వల్లే ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. సోమవారం ఉదయం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విచారణకు హాజరు కావాల్సిందిగా బీఎల్ సంతోష్‌కు ఇంతకుముందు నోటీసులు పంపగా.. ఆయన గైర్హాజరు అయ్యారు. దానికితోడు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదు. శ్రీనివాస్ ఒక్కరే హాజరు కాగా.. తుషార్ వెల్లాపల్లి, జగ్గుస్వామిలు హాజరవ్వలేదు. నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరుకాకపోతే 41–ఏ (3), (4) సీఆర్‌పీసీ కింద అరెస్టు చేస్తామని ఏసీపీ బి.గంగాధర్ తొలి నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆ నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించడంతో.. తదుపరి ఉత్తర్వులు వెలువడేదాకా సంతోష్‌ను అరెస్టు చేయవద్దని సిట్‌ను న్యాయస్థానం ఆదేశించింది.