ఒలింపిక్స్‌లో మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించిన పీవీ సింధు.. ఇవాళ సొంత గడ్డకు రానుంది. హైదరాబాద్‌లో అడుగుపెట్టనుంది. పతకాల సింధుకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు అభిమానులు. అటు టోక్యో నుంచి ఢిల్లీకి చేరుకున్న సింధుకు మంత్రులు ఘన స్వాగతం పలికారు. దేశానికి వన్నె తెచ్చిన వనితను సాదరంగా సత్కరించారు. ఒలింపిక్‌లో కెరీర్‌లో ఒక్క మెడల్ కొడితే గొప్ప అనుకునే సమయంలో.. తెలుగు తేజం పీవీ సింధు వరుసగా రెండు పతకాలు సాధించింది. బ్యాడ్మింటన్‌లో గత ఒలింపిక్స్‌లో రజతం.. ఇప్పుడు కాంస్యం గెలుచుకుంది. దేశానికి రెండో పతకం అందజేసిన సింధుకు ఢిల్లీలో గ్రాండ్ వెల్కమ్ దక్కింది. ఇవాళ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లో అడుగుపెట్టనుంది సింధు. దీంతో ఆమెకు ఘనస్వాగతం చెప్పేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు అభిమానులు రెడీ అయ్యారు.
అటు ఢిల్లీలో అడుగుపెట్టిన పీవీ సింధును కేంద్రమంత్రులు ఘనంగా సత్కరించారు. క్రీడా-యువజన వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సాంస్కృతిక-పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సింధును కలిసి అభినందించారు. భారత అత్యంత గొప్ప ఒలింపియన్లలో పి.వి.సింధు కూడా ఒకరని ప్రశంసించారు క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. దేశం తరఫున ఆడాలని పరితపించే భారత క్రీడాకారులందరికీ సింధు ఆదర్శమని చెప్పారు. సెమీ ఫైనల్స్ చేరడంలో వైఫల్యంపై నిరాశ చెందినప్పటికీ ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతకం సాధించడం ఎంతో సంతోషం కలిగించిందని చెప్పింది సింధు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సింధు కాంస్య పతకం సాధించింది. సెమీస్‌లో తైజుయింగ్ చేతిలో ఓడినా.. తర్వాత బ్రాంజ్ మెడల్ కోసం జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడింది. వరుసగా రెండో మెడల్ కొట్టింది.