Sharmila Asks Munugode People To Avoid BJP TRS Congress In Elections: మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. ఎవరు ఎమ్మెల్యేలను కొనాలని చూశారు, ఎవరు అమ్ముడుపోవాలని చూశారు? అని ప్రశ్నించారు. కేవలం డబ్బులు దొరికాయని పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారని, మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రగతి భవన్‌ను తరలించడం ఏంటి? వారిని కూడా ప్రశ్నించాలి కదా? అని నిలదీశారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు నిజంగా అమాయకులైతే.. ప్రగతి భవన్‌లో ఎందుకు దాచి పెట్టారని అడిగారు. ప్రజలకు నిజానిజాలు తెలియన్న షర్మిల.. కేంద్రంలో ఉన్న బీజేపీ ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని తాలిబాన్లలా పాలిస్తున్నారని.. మునుగోడులో నల్లా తిప్పితే, నీళ్లకు బదులు లిక్కర్ వస్తోందని ఆరోపణలు చేశారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాయని, ఆ మూడు పార్టీలకు ఓటు వేయకుండా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇన్నాళ్లూ కనిపించని మునుగోడు సమస్యలు, ఇప్పుడే ఆ పార్టీలకు కనిపించాయా? అంటూ ఉద్ఘాటించారు.
ఒక పార్టీకి అధికార మదం ఎక్కితే.. మరో పార్టీ అహంకారంతో రాజకీయాలు చేస్తోందని షర్మిల వ్యాఖ్యానించారు. అభివృద్ధి చేశామని ఎన్నికలకు వెళ్లే దమ్ము ఏ పార్టీకి లేదన్నారు. తమ పార్టీలను గెలిపిస్తే.. అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తున్న నాయకులకు ఎన్నికల ముందు అభివృద్ధి చేయాలని తెలీదా? అని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని రూ. 100 కోట్లతో కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని టీఆర్ఎస్ వాళ్లు అంటున్నారని.. బీజేపీ మాత్రం ఇదంతా కేసీఆర్ డ్రామా అని వాదిస్తోందని.. అసలు ఇందులో నిజాలేంటి? అని షర్మిల అడిగారు. బీజేపీ నేతల్ని అరెస్ట్ చేసినట్టే, టీఆర్ఎస్ నేతల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఈ ఘటన తర్వాత ఆ ఎమ్మెల్యేలు పత్తా లేకుండా పోయారన్నారు. ఒక పార్టీ తరఫున పోటీ చేసి, మరో పార్టీకి అమ్ముడుపోవడం రాజకీయ వ్యభిచారం కాదా? అని నిలదీశారు. ఇందులో బీజేపీ పాత్ర ఎంత? కేసీఆర్ పాత్ర ఎంత? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై బీజేపీ కోర్టులో పిల్ వేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ.. నేరుగా సీబీఐ విచారణ జరిపించి.. మీ నిజాయితీని నిరూపించుకోవచ్చు కదా! అని డిమాండ్ చేశారు.
ఇక కేసీఆర్ చెప్తున్నట్టు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్దోషులు అయితే.. మీరెందుకు సీబీఐ విచారణ అడగడం లేదని టీఆర్ఎస్‌ని షర్మిల ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని స్పీకర్ దృష్టికి ఎందుకు తీసుకుపోలేదని, ఎందుకు విచారణ జరిపించాలని అడగడం లేదని నిలదీశారు. కేసీఆర్ తన ఎమ్మెల్యేల్ని ప్రగతి భవన్‌లో ఎందుకు దాచి పెట్టారో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యమని.. దొంగలెవరో, దోషులెవరో తెలియాల్సిన అవసరం ప్రజలకు ఉందని షర్మిల చెప్పారు.