ఆంధ్ర పాలనలో లేని దుర్మార్గం టీఆర్ఎస్ పాలనలో నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. హనుమకొండ డీసీసీ భవన్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రాహుల్ రాకతో కేసిఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. రాహుల్ పర్యటనపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన రిపోర్ట్ తో టీఆర్ఎస్ నేతల్లో భయం మొదలైందన్నారు. కేసిఆర్, కేటీఆర్ లు ఎలక్షన్ టూరిస్ట్ లు అంటూ కౌంటర్ ఇచ్చారు సీతక్క. ఎన్ని అడ్డంకులు పెట్టినా సభ విజయవంతమైందని సీతక్క అన్నారు.
రాహుల్ గాంధీ డమ్మీ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు సీతక్క్. డమ్మీలెవరో, డమ్మీ మంత్రులెవరో అందరికీ తెలుసున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మంత్రికైనా స్వేచ్ఛ ఉందా..? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని రాహుల్ గాంధీ మాట్లాడితే.. స్క్రిప్టు అంటారా అంటూ మండిపడ్డారామె. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలవే డ్రామాలని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వదులుకుని, త్యాగం చేశారని చెప్పారు. ‘మీరు ముఖ్యమంత్రి కాకుండానే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారు’ అంటూ మంత్రి కేటీఆర్ పై సెటైర్లు వేశారు. ఆంధ్రా నాయకుల పాలనలో కూడా ఇప్పుడున్న పరిస్థితులు లేవన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటే అన్నారు. రాహుల్ గాంధీపై టీఆర్ఎస్ నాయకుల విమర్శలు హాస్యాస్పదం, అర్థరహితమన్నారు సీతక్క.
ఎన్నికల కోసమే కేసిఆర్, కేటీఆర్ పర్యటనలు చేస్తారని అన్నారు. దేశంలో రైతుల దీక్షకు సంపూర్ణ మద్దతు, భరోసా ఇచ్చింది రాహుల్ గాంధీ అని గుర్తు చేశారు. కానీ బీజేపీతో కలిసి టీఆర్ఎస్ రైతుల ఉసురు తీసిందని మండి పడ్డారు. ఉద్యమంలో లేని ప్రకాష్ రాజ్ ను అంటే టీఆర్ఎస్ కు పౌరుషం ఎందుకు? అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్, ఇన్పుట్ సబ్సిడీ కాంగ్రెస్ ఇచ్చినవి కాదా అన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆపలేని, టీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ కూడా లేకుండా వరంగల్ ను అభివృద్ధి ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతల మాటలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.