కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలు చేపట్టిన ఆర్మీ అభ్యర్థులను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలులో ఉంచిన విషయం తెలిసిందే. అయితే.. అరెస్టైన ఆర్మీ అభ్యర్థుల తల్లిదండ్రులు జైలు బయట వారి పిల్లల కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే.. చంచల్‌గూడ జైలుకు ఆర్మీ రిక్రూట్మెంట్ అభ్యర్థుల తల్లిదండ్రులు చేరుకున్నారు.. అరెస్టైన తమ పిల్లల్ని ములాఖత్ ద్వారా కలుసుకునేందుకు బాధిత కుటుంబాలు జైలు బయట వేచిచూస్తున్నాయి.
మరోవైపు ఈ కేసులో ప్రధాన సూత్రధారి సుబ్బారావు అరెస్టు రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు ఉన్నాడు. సుబ్బారావు కు బెయిల్ మంజూరు చేయాలని నేడు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు సుబ్బారావు తరఫు న్యాయవాదులు. తమ పిల్లలు జైల్లో ఉండటంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తన పిల్లల్ని బయటికి తీసుకు రావాలని అరెస్టైన ఆర్మీ అభ్యర్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.