Kanti Velugu: తెలంగాణ రాష్ట్రంలో అంధత్వ నివారణకు ప్రభుత్వం వెలుగుల యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్ పరిధిలోని ప్రజలందరికీ గురువారం నుంచి కంటి పరీక్షలు చేయనున్నారు. తెలంగాణలో కంటివెలుగు కార్యక్రమం ద్వారా అంధత్వ నివారణకు ఉచిత కంటివెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్క్రీనింగ్ సెంటర్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈవాల్టి నుంచి జూన్ 30 వరకు కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మొత్తం 241 ప్రాంతాల్లో 100 రోజుల పాటు 5058 శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ కంటి వెలుగు శిబిరాలు నేడు అమీర్‌పేటలోని వివేకానందనగర్ కమ్యూనిటీ హాల్‌లో ఉదయం 9 గంటలకు, వెంగళరావునగర్ డివిజన్‌లోని మధురానగర్ కమ్యూనిటీ హాల్‌లో 10 గంటలకు మంత్రులు హరీశ్‌రావు తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభిస్తుండగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారంలో మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించనున్నారు.
హైదరాబాద్ నగరంలోనే ప్రతిరోజూ దాదాపు 15,525 మందికి కంటివెలుగు ద్వారా సేవలు అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు కంటివెలుగు శిబిరాలకు 3,81,445 రీడింగ్ గ్లాసులను కూడా పంపించారు. కంటి పరీక్షల నిమిత్తం శిబిరానికి వచ్చే తేదీ, సమయం, శిబిరానికి సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలను అందజేయాలన్నారు. శిబిరానికి వచ్చే పక్షంలో ఆధార్ కార్డు లేదా ఆరోగ్యశ్రీ లేదా రేషన్ కార్డు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాలి. కంటి సమస్యలు ఉన్నవారు ఉచిత కంటి పరీక్ష శిబిరాలకు వెళ్లి పరీక్షలు పూర్తయిన తర్వాత ఉచితంగా కంటి అద్దాలు, మందులు అందజేస్తున్నారు. కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేస్తారు. సమీప, దూర దృష్టి ఉన్న వారిని 15 రోజుల్లో ఇంటికి పంపిస్తామని అధికారులు తెలిపారు. అలాగే దృష్టిలోపానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు లిఖితపూర్వకంగా తెలియజేసి అద్దాలపై స్పష్టంగా ముద్రిస్తారు. వివరాల కోసం తమ పరిధిలోని ఆష్ వర్కర్లు ఏఎన్‌ఎంలను సంప్రదించాలన్నారు.