పాఠశాలల రీ-ఓపెన్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ సీఎం టేబుల్ పై ఉందన్నారు. రాష్ట్రంలో విద్యా సంస్థలను మూసివేయడం వల్ల ప్రైవేట్ స్కూళ్లు, ప్రైవేట్ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ట్రస్మా ప్రతినిధులు ఎమ్మెల్సీ పల్లాకు వినతి పత్రం అందజేశారు. పాఠశాలల పునః ప్రారంభంపై సీఎం కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా పల్లా చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యే వరకూ ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి జీవన భృతి కొనసాగించేలా చూస్తామన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ రాయితీ, బస్సుల ట్యాక్స్ రద్దు వంటి అంశాలపైనా సంబంధిత అధికారులతో మాట్లాడతానని వివరించారు.