కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలోనూ అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో రేపు గాంధీ భవన్ లో సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, ఇంచార్జ్ ఆర్గనైజేషన్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. అగ్నిపథ్ పేరుతో కొత్త పథకం తీసుకువచ్చి సైన్యంలో చేరాల్సిన యువతను తీవ్రంగా అవిమానపరిస్తూ సైన్యంలో కూడా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ లాగా చేస్తోందని ఆయన మండిపడ్డారు.
యువతను నిర్వీర్యం చేస్తున్న అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని ఏఐసీసీ పిలుపులో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గాంధీ భవన్ లోని గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. అయితే ఈ దీక్షకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. అగ్నిపథ్ రద్దేయ్యే వరకు పోరాటంలో పాల్గొనండి అని ఆయన పిలుపునిచ్చారు.