తమ సమస్యలు పరిష్కరించాలంటూ బాసర ట్రిపుల్ ఐటీలోని విద్యార్థులు గత నాలుగు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా.. వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే.. విద్యార్థులు మాత్రం సీఎం కేసీఆర్ లేక మంత్రి కేటీఆర్ వచ్చి మా సమస్యలను వినాలని మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో తాజా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ.. ఓ ప్రకటనను విడుదల చేశారు. విద్యార్థులు ఆందోళనను విరమించండని, మీ సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆమె వెల్లడించారు.
ఇప్పటికే సమస్యల పరిష్కారం కోసం డైరెక్టర్‌ని నియమించడం జరిగిందని, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరణను కూడా పంపడం జరిగిందని వారితో చర్చించాలని ఆమె కోరారు. మీ సమస్యలను తక్కువ చేయడం మా ఉద్దేశం కాదన్న మంత్రి.. ఏ యూనివర్సీటీలో లేని విధంగా ఇక్కడ స్టూడెంట్ అర్గనైజేషన్ ఉందన్నారు. చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఇది మీ ప్రభుత్వమని దయచేసి చర్చలకు రావాలని, ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరిస్తుందని ఆమె వెల్లడించారు.