తెలంగాణలో ఏబీవీపీ ప్రాంత కార్యాలయం అద్భుతంగా నిర్మించారని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. హైదరాబాద్ లోని తార్నాకలో కొత్తగా నిర్మించిన ఏబీవీపీ ఆఫీస్ స్ఫూర్తి ఛాత్రశక్తి భవన్ ను ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల స్వప్నం, నిష్టతో ఈ భవనం సాధ్యమైందని ఆయన ప్రశంసించారు. తెలంగాణ ఏబీవీపీ కార్యకర్తల త్యాగానికి ప్రతీక ఈ భవనమని, ఒకప్పుడు విద్యార్థి పరిషత్ కార్యకర్త అంటే సరస్వతిని పూజిస్తాడు అనేవారు కానీ ఇప్పుడు ఆ కార్యకర్తకు అఖండ దేశమే దైవం అనే మార్పు వచ్చిందన్నారు. రాజుల కాలం, అంతకంటే ముందు నుంచి ఎంతో మంది వచ్చారు పోయారు.
కొంతకాలం గుర్తుఉంటారని, కానీ రాముడు 8 వేల సంవత్సరాల తరువాత కూడా పూజలు అందుకుంటున్నారన్నారు. రాముని స్ఫూర్తి, సీత శ్రద్ధ మన ప్రతి కార్యకర్తలో ఉందంటూ.. ఇతిహాస కథతో ఏబీవీపీ కార్యకర్తల్లో స్ఫూర్తి నింపారు. తండ్రి వ్యాఖ్య పరిపాలన చేసిన వారిని 8 వేల ఏళ్లు అయినా ప్రజలు మర్చిపోలేదని, మనుషుల జీవితంలో రాముడు పరివర్తన తీసుకొచ్చారని మోహన్ భగవత్ అన్నారు. యూపీలో ఇప్పటికీ కొన్ని మైళ్ల దారిలో ఎవరూ నడవరని, ఎందుకంటే సీతాదేవి పాదయాత్ర చేసే సమయంలో కాళ్ల నుంచి రక్తం వచ్చిందని.. అందుకే ఆ ప్రాంతంలో వ్యవసాయం కూడా చేయరని మోహన్ భగవత్ వెల్లడించారు.