CM Revanth Reddy : 70 వేల జాబ్స్ భర్తీ.. పేపర్ లీకేజీలపై బీఆర్ఎస్‌కు రేవంత్ కౌంటర్.!

  • బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
  • 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.. మరో 10 వేల పోస్టులకు నోటిఫికేషన్లు
  • అప్పుల ఊబిలో తెలంగాణను బీఆర్ఎస్ నెట్టేసిందన్న సీఎం
  • అఘోరా పూజలపై రేవంత్ సంచలన ఆరోపణలు
Cm Revanth

Cm Revanth

సంగారెడ్డి పర్యటనలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చిన ఆయన, కాంగ్రెస్ పాలనలోనే మహిళలకు తగిన గౌరవం , సంక్షేమం సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు మహిళలకు కేబినెట్‌లో మంత్రి పదవే ఇవ్వని నాయకులు, ఈ రోజు తమ ప్రభుత్వం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. నాటి పాలకులు చేసిన తప్పులకు మహిళలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని వ్యాఖ్యానించారు.

ఉద్యోగాల భర్తీ వర్సెస్ పేపర్ లీకేజీలు

నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో పేపర్లు అమ్ముకుని యువత భవిష్యత్తును నాశనం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే దాదాపు 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, దానికిదనంగా మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపారు. విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి, వారి శవాల పునాదులపై మళ్లీ అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని, పెట్రోల్ బాటిళ్లు పట్టుకుని డ్రామాలు ఆడే ‘అగ్గిపెట్టే రావు, అఘోరా రావు’ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.

‘విధ్వంసం నుంచి వికాసం వైపు..’ అప్పుల ఊబిలో తెలంగాణ

కేసీఆర్ పాలనలో పూర్తిగా విధ్వంసమైన తెలంగాణను తాము వికాసం వైపు నడిపించడానికి నిరంతరం శ్రమిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం చేసిన ఊహించని అప్పులకు నెలకు వేల కోట్ల రూపాయల వడ్డీలు చెల్లిస్తూనే, అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొస్తున్నామని వివరించారు. కొన్ని సంక్షేమ ఫలాలు అందడంలో పూట ఆలస్యం కావచ్చు కానీ, ప్రజల హక్కులకు ఎక్కడా భంగం కలగనివ్వమని హామీ ఇచ్చారు. దేశంలోనే మొదటిసారిగా ప్రజా సంక్షేమం కోసం శాస్త్రీయంగా కులగణన చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, 2034 వరకు ప్రజల ఆశీస్సులు తమ ప్రభుత్వానికే ఉండాలని కోరారు.

చేతబడులు, అఘోరా పూజల సంచలన ఆరోపణలు

ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి, కొందరు నాయకులు రాష్ట్రంలో కరువు రావాలని, రైతులు నష్టపోవాలని కోరుకుంటూ అఘోరా పూజలు చేయించారని విమర్శించారు. నాటి పాలకులు శివమొగ్గ దేవాలయంలో , తమిళనాడులోని క్షుద్ర పూజల కేంద్రాలలో నిర్వహించిన అఘోరా పూజల వెనుక ఉన్న నిజాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తనపై, పీసీసీ అధ్యక్షుడిపై చేతబడులు చేయించినా పర్వాలేదు కానీ, రాష్ట్ర ప్రజల కీడును కోరుకుంటూ పూజలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సొంత బావమరిదే కేసీఆర్‌పై చేతబడి చేశాడంటూ ప్రచారం చేసుకుంటున్న తీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.