గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శనివారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నేతలు, ఇతర ప్రయివేటు వైద్య, విద్య కళాశాల్లో పీజీ సీట్ల దందాపై చర్యలు కోరుతూ రేవంత్ రెడ్డి లేఖను రాశారు. అయితే ప్రయివేటు వైద్య కళాశాలలు సీట్లను బ్లాక్ చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నాయన్నారు. వైద్య సీట్ల దందాలో మంత్రులు కూడా భాగస్వామ్యం కావడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డిలు సీట్ల దందాకు పాల్పడుతున్నట్లు విద్యార్ధులు ఆరోపిస్తున్నారన్నారు.
నీట్ ర్యాంక్ ఆధారంగా చిన్న చిన్న లొసుగులను ఆసరా చేసుకుని ఏటా రూ. వంద కోట్లు మేర సీట్లను బ్లాక్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రయివేటు కళాశాలల్లో సీట్ల కోసం దరఖాస్తు చేయించడం, సీట్ల కేటాయింపు చేయడం కౌన్సిలింగ్ పూర్తయ్యిన తరువాత అదే సీటును బ్లాక్‌లో ఇతరులకు రెండు నుంచి రెండున్నర కోట్లకు అమ్ముకుంటున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. కన్వీనర్ కోటాలో మెరిట్ ఆధారంగా పేద మధ్య తరగతి విద్యార్ధులకు రావాల్సిన సీట్లను మేనేజ్ మెంట్ కోటాలోకి మార్చి అమ్ముకుంటున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.