ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ.. రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది.. ఈ సమావేశంపై అనేక విధాలుగా ప్రచారం సాగుతోంది.. అయితే, పీకే-కేసీఆర్ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. గత మూడు రోజులుగా ఓ అలజడి నడుస్తోంది.. పీకే.. కాంగ్రెస్, టీఆర్ఎస్‌ను కలపడానికి వచ్చిండు అంటున్నారు.. జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయానికి మేం ఏమి చెప్పలేమన్నారు.. కానీ, రాహుల్ గాంధీ… టీఆర్ఎస్ గుంపుతో చేరినోడు వద్దు, కేసీఆర్‌తో జట్టు కట్టేది లేదని స్పష్టత ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ ఓ విషపు నాగు లాంటోడు.. పాలు పోసినోడినే కాటేస్తాడని కామెంట్ చేశారు రేవంత్.
Read Also: BJP: బండి సంజయ్ పాదయాత్ర వాయిదాపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ..
పీకేపై విచిత్ర ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు రేవంత్‌రెడ్డి.. పీకే… సోనియా గాంధీతో జరిగిన చర్చలో పాల్గొన్నారని.. కాంగ్రెస్ పార్టీతో పని చేసేందుకు పీకే ఆసక్తి చూపుతున్నారన్న ఆయన.. ఈ విషయంపై కాంగ్రెస్ ఓ కమిటీ వేసింది.. పీకే, కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే ఏ రాష్ట్రంలో మోడీతో జట్టుకట్టిన పార్టీలను, ప్రాంతీయ పార్టీలతో ఉన్న వ్యాపార ఒప్పందాలు వదులుకోవాలని చెప్పారన్నారు.. ఇక, కేసీఆర్-పీకే భేటీపై స్పందిస్తూ.. టీఆర్ఎస్‌తో చేసుకున్న అవగాహన నుంచి తప్పుకునేందుకు ప్రశాంత్ కిషోర్ వచ్చారని.. టీఆర్ఎస్ వ్యూహకర్తగా ఉంటే మేం పార్టీలో చేర్చుకోమని కాంగ్రెస్ అధిష్టానం కండిషన్ పెట్టిందన్నారు రేవంత్‌రెడ్డి.. మరోవైపు, కేసీఆర్‌తో నడిచే ఎవరిని కూడా మేం దగ్గరకు రానివ్వమని.. తెలంగాణలో గుండుకు, అరగుండు ఏమి ఉంది? అంటూ బీజేపీ నేతలపై సెటైర్లు వేశారు.. సర్వేల్లో ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్ట్‌తో కాంగ్రెస్‌కు పట్టున్న జిల్లాల్లో బండి సంజయ్ తిరుగుతున్నాడు అని ఆరోపించారు… కేసీఆర్ ఇచ్చిన డబ్బులతో బండి సంజయ్ సభలు పెట్టిండు.. అక్కడ జనం లేక సభలు వెలవెల బోవడం దేనికి సంకేతమో జనం తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు రేవంత్‌రెడ్డి.