Revanth Reddy Fires On TRS Govt For Arresting Bhatti Vikramarka And Co: కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కని అడ్డుకోవడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. టీఆర్ఎస్ అవినీతి కారణంగా కాళేశ్వరంతో పాటు నిండా మునిగిన సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు పెట్టేందుకు భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన బృందాన్ని ఎందుకు అడ్డుకున్నారని, అసలు ఆ అవసరం ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. నిన్న (ఆగస్టు 16) కూడా ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, పొదెం వీరయ్యలను అరెస్ట్ చేసి ప్రభుత్వం పిరికిపందలా వ్యవహరించిందని విమర్శించారు. గత నెలలో వరదలు వచ్చినప్పుడే కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టులకు భారీ నష్టం జరిగిందని తాము చెప్పామని.. కానీ ప్రభుత్వం తమ మాటల్ని పట్టించుకోకుండా మూర్ఖంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
గోదావరి వరదల వల్ల జులై 14న అన్నారం (సరస్వతి), కన్నెపల్లి (లక్ష్మి) పంప్ హౌస్లు నీట మునిగాయని.. కన్నెపల్లి పంప్ హౌస్‌లో క్వాలిటీ లేకుండా కట్టిన ప్రొటెక్షన్ వాల్‌తో పాటు క్రేన్లు, లిప్పు కూలడంతో మోటార్లు తుక్కుతుక్కు అయ్యాయని రేవంత్ పేర్కొన్నారు. అన్నారం పంప్ హౌసుకు ‘డిజైన్ లోపం’ శాపంగా మారిందని.. ఫలితంగా వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ఇంజనీరింగ్ నిపుణులు వెల్లడించారని రేవంత్ చెప్పారు. కానీ.. ప్రభుత్వం మాత్రం అత్యంత బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తూ, కేవలం రూ. 25 కోట్ల నష్టమే జరిగిందని అవాస్తవలు చెప్తోందన్నారు. ఆ నష్టాలను సైతం కాంట్రాక్ట్ సంస్థే భరిస్తుందని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌తో అబద్ధాలను ప్రచారం చేయించిందని ఆరోపించారు. ఇలాంటి వాస్తవాలను వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకే.. భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల బృందం ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరిందని, తమ అవినీతి బయటపడుతుందన్న భయంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పదే పదే వారిని అడ్డుకుంటోందని ఫైర్ అయ్యారు.
ప్రభుత్వంతో సమానంగా ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీల మీద ఉంటుందని.. అయితే ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టుల్ని సందర్శించకుండా ఆంక్షలు విధిస్తూ నిరకుశంగా వ్యవహరిస్తోందని రేవంత్ పేర్కొన్నారు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో నష్టం జరగకుండా ఉంటే.. దాన్ని చూపించండానికి కేసీఆర్ ఎందుకు వణుకుతున్నారని నిలదీశారు. వాస్తవాలు బయటికి వస్తాయనే, సీఎల్పీ బృందం పర్యటనకు ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. సీఎల్పీ బృందాన్ని అరెస్ట్ చేయడాన్ని తాను ఖండిస్తున్నానని, అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని రేవంత్ డిమాండ్ చేశఆరు. అంతేకాదు.. వారి సందర్శనకు ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాలని, దగ్గరుండి ప్రాజెక్టుల్ని చూపించాలని కోరారు. అలా చేయకపోతే.. కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.