CM Revanth Reddy : తెలంగాణలో రాబోయే 2034 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, వచ్చే ఎన్నికల్లోనూ తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వేల కోట్లు దోచుకున్న కేసీఆర్ లాంటి వ్యక్తులు మళ్లీ వస్తే ఏమవుతుందో ప్రజలకు బాగా తెలుసని, రాష్ట్రంలో ఎప్పటికీ మూడు రంగుల జెండాయే ఎగురుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే ఆయన బీఆర్ఎస్ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, రెండున్నరేళ్ల తమ కాంగ్రెస్ పాలనకు మధ్య మేనిఫెస్టోల అమలుపై అసెంబ్లీలో ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధమని, దీనికోసం స్పీకర్‌కు లేఖ రాయాలని ప్రతిపక్షానికి సూచించారు. తమ హయాంలో కేసీఆర్ తినే సన్నబియ్యాన్నే నేడు పేదలు తింటున్నారని, అనుమానం ఉంటే తండాలకు వెళ్లి చూసుకోవచ్చని సీఎం పేర్కొన్నారు.
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే ప్రతిపక్షాలు కడుపుమంటతో ఏడుస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తూ.. గత 30 నెలల కాలంలో సంక్షేమ పథకాల కోసం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశామని వివరించారు. కేంద్రంతో మాట్లాడి రాష్ట్రంలో యూరియా కష్టాలు లేకుండా చేశామని, రికార్డు స్థాయిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. గత ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ‘కూలేశ్వరం’ గా మారిందని, ఇప్పుడు ఆ నీళ్లు లేకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయి పంట ఉత్పత్తి సాధిస్తున్నామని గుర్తుచేశారు. గిరిజనులకు మెరుగైన విద్యను అందిస్తున్నామని, భవిష్యత్తులో గురుకులాల ద్వారా వందలాది మంది అంబేద్కర్లను తయారుచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

