జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై టీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీ సీవీ ఆనంద్ చెప్పిన విధానం చూస్తుంటే.. అవసరమైన వాళ్లను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో నిందితులు, బాధితురాలు ప్రయాణించిన బెంజ్ కారు, ఇన్నోవా ముఖ్యమైన ఆధారాలని ఆయన అన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే, యజమానులకు సమాచారం అందించాలని..ఎంపీ యాక్ట్ ప్రకారం యజమానులను పోలీస్ స్టేషన్ కు పిలవాలని.. లేదంటే వాళ్లపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. వాహనాల యజమానులపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇన్నోవా వాహనం ఎవరిదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్న వక్ఫ్ బోర్డ్ చైర్మన్, ఎంఐఎం నేతల పిల్లలు ఈ కేసులో ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు భాగస్వామ్యంలో ఉన్నాయని.. ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నాయని.. రేపులు, మర్డర్లలో కూడా ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఉపయోగించాల్సిన ప్రభుత్వ వాహనాన్ని అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారం జరిగిన వాహనాలు ఎవరివి..వారిని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. కేసును బలహీన పరిచి నిందితులను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కమిషనర్ సీవీ ఆనంద్ తప్పించుకునేలా సమాధానాలు చెప్పారని ఆయన అన్నారు.
హైదరాబాద్లో జరగుతున్న సంఘటనలు బ్రాండ్ ఇమేజీని తగ్గిస్తున్నాయని..వారం పదిరోజుల్లో ఎన్నో గ్యాంగ్ రేపులు జరిగాయని ఆయన ఆరోపించారు. వీటన్నింటికి పబ్ లు, గంజాయినే కారణం అని ఆరోపించారు. పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తడి తీసుకువస్తుందని ఆరోపించారు. మైనర్లను అనుమతి ఇస్తున్న పబ్ లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డ్ ఛైర్మెన్ పై కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని..మైనర్ బాలికలపై రేపులు జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు సమీక్ష చెయ్యలేదని ప్రశ్నించారు. జాతీయ అంతర్జాతీయ అంశాలపై స్పందించే ఒవైసీ, మైనర్ బాలిక రేప్ విషయంలో ఎందుకు స్పందించరని అడిగారు.
హైదరాబాద్ ను రక్షించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని.. పబ్ లపై దాడి చేయ్యాలని ఎన్ఎస్యూఐకి పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ఏయిర్ పోర్ట్ వద్ద నిర్వహిస్తున్న పబ్ లు బ్రోతల్ హౌజ్ లను మించిపోతున్నాయని ఆరోపించారు. అసాంఘిక కార్యకలాపాలకు హైదరాబాద్ అడ్డాగా నిలుస్తుందని విమర్శించారు.