Revanth Reddy: తెలంగాణ సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు దక్కాల్సిన సంక్షేమాన్ని, ప్రభుత్వ భూములను, చివరకు ప్రాజెక్టు ముంపు బాధితుల ప్యాకేజీలను కూడా కేసీఆర్ కుటుంబం, ఆయన బంధుగణం అడ్డగోలుగా దోచుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్ లక్ష కోట్లు కొల్లగొడితే.. ఆయన సడ్డకుడు, సడ్డకుని కొడుకులు మానేరు ఇసుకను దోచుకుని, చివరకు తాము పేదలమంటూ తెల్ల రేషన్ కార్డులతో మిడ్ మానేరు ముంపు పరిహారాన్ని కొట్టేశారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన స్పీచ్‌లో అత్యంత విస్మయకరమైన అంశాన్ని బయటపెట్టారు. ‘‘మిడ్ మానేరు ప్రాజెక్టులో కొంపలు మునిగిపోయి బువ్వకు గతిలేని నిరుపేదలం మేమేనంటూ కేసీఆర్ సడ్డకుని కొడుకు జోగినపల్లి సంతోష్ రావు, రవీందర్ రావు, సౌమ్యారావు, వారి చిన్నాయనలు నకిలీ దరఖాస్తులు చేసుకున్నారు. తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇళ్ల పట్టాలు, ముంపు బాధితుల పరిహార ప్యాకేజీలు కొట్టేశారు. ఆనాడు ముంపు బాధితుడిగా కొంప పోయిందని సర్కారు సొమ్ము తీసుకున్న సంతోష్ రావు.. ఈరోజు పదివేల కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి ఎలా అయ్యాడు? అది ఎవరి అబ్బ జాగీరు? ఎవరి కొంపలు కొల్లగొట్టి సంపాదించిన ఆస్తి?’’ అని రేవంత్ తీవ్రస్థాయిలో నిలదీశారు.
మానేరు వాగులో అక్రమ ఇసుక దందాను కేటీఆర్, సంతోష్ రావు, రవీందర్ రావు నడిపించారని రేవంత్ ఆరోపించారు. ‘‘ఇసుక లారీల దోపిడీకి అడ్డువచ్చారనే ఏకైక కారణంతో నేరెళ్లలో దళిత సోదరులను లారీల కింద తొక్కించి చంపిన చరిత్ర గత పాలకులది. తమ ప్రాణాలకు విలువ లేదా అని నిరసన వ్యక్తం చేసిన బలహీన వర్గాలు, దళిత బిడ్డలను పోలీస్ స్టేషన్లలో పెట్టి కరెంట్ షాకులు ఇచ్చి, జీవితాంతం సంసారానికి పనికిరాకుండా చిత్రహింసలు పెట్టారు. ఆనాడు కేంద్ర మాజీ స్పీకర్, బాబు జగ్జీవన్ రామ్ కుమార్తె మీరా కుమార్‌తో కలిసి తాము పరామర్శకు వస్తే ఆమెను సైతం నిర్బంధించిన నియంతలు నేడు నీతులు చెబుతున్నారు’’ అని మండిపడ్డారు. మనుషులను మనుషులు మోసం చేయడం సహజమేమో కానీ, సాక్షాత్తు దేవుళ్లనే నిలువునా మోసం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని రేవంత్ దుయ్యబట్టారు. ‘‘వేములవాడ రాజన్న సన్నిధిలో నా పెళ్లి జరిగిందని చెప్పి, ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తానని చెప్పి నయాపైసా ఇవ్వకుండా రాజన్నకు శఠగోపం పెట్టారు. భద్రాచలం సీతారాములకు వజ్రాలు, వైడూర్యాలు పొదిగిన కిరీటాలు చేయిస్తానని చెప్పి రామయ్యను కూడా నిలువునా ముంచేశారు. ఒకడేమో గోదావరి జలాలను దోచాడు.. మరొకడేమో మానేరు ఇసుకను గుల్ల చేశాడు.. ఇంకొకడేమో హైదరాబాద్‌లో ఆంధ్రా వ్యాపారులతో చేతులు కలిపి వాటాలు తీసుకుంటూ వేల కోట్లు, హోటళ్లు, పేపర్లు, టీవీ ఛానళ్లు పెట్టారు’’ అంటూ సిరిసిల్ల ప్రజలు వేసిన ఓట్లను కేసీఆర్ కుటుంబం సొంత ఆస్తులుగా మార్చుకుందని రేవంత్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు.

