టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్గొండలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, సాయుధ పోరాట పటిమ గల నాయకత్వం ఈ జిల్లాలో ఉందన్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ కాంగ్రెస్ కట్టామని సగర్వంగా చెప్పుకుంటామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పూర్తయ్యాయన్నారు. మేము మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేని దద్దమ్మలు మీరు.. అని ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నెల్లికల్లు లిఫ్ట్ ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని ఇప్పటికి మొదలు పెట్టలేదని, భూ కబ్జాలు చేసే ఎమ్మెల్యే సైదిరెడ్డి.. ఇసుక మాఫియా కు పాల్పడే మంత్రి జగదీశ్ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు.
జానారెడ్డి లాంటి పెద్దమనుషులు చట్టసభల్లో లేకపోవడం వల్ల సభలకు గౌరవం తగ్గిందని, ఏ సమస్య వచ్చినా పరిష్కరించే సత్తా ఉన్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో పులులు, సింహాలు ఉన్నాయి.. కానీ ఆ పులులను సింహాలను ఆడించే సత్తా ఉన్న నాయకులు జానారెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు. ల్యాండు, సాండు, మాఫియాలు, మర్డర్లు చేసే టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పలంటే నల్గొండ బిడ్డలు ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారనే నమ్మకం నాకుందని, రైతులను వరి వేయొద్దని కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో 150 ఎకరాల వరి వేసాడని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో మార్చి నెలలోనే ప్రభుత్వాన్ని హెచ్చరించామని, మిల్లర్లకు కోటా కేటాయించలేదు, బస్తాలు కొనలేదు, అకాల వర్షాలకు తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధర కల్పించి కొనాలని ఆయన డిమాండ్ చేశారు. కొనకపోతే మీ అంతు తేల్చేదాక పోరాటం చేస్తామని, కేంద్రానికి రాష్ట్రానికి రాజకీయ ప్రయోజనమే కావాలి రైతు ప్రయోజనం అవసరంలేదని ఆయన ధ్వజమెత్తారు. వరంగల్ సభ రైతుల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న సభ అని, వరంగల్ సభ ద్వారా రైతులకు మేలు జరగాలన్నారు.