NTV Telugu Site icon

TS Assembly KRMB Issue: కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు ఇచ్చేదే లేదు..

Uttam Kumar Vs Harish Rao

Uttam Kumar Vs Harish Rao

TS Assembly KRMB Issue: కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ బోర్డుకు అప్పగించ కూడదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారు. షరతులకు అంగీకరించకుండా కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించబోమని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణకే ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నాగార్జున సాగర్ ప్రాజెక్టును దళారుల సాయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేజిక్కించుకుందని ఆరోపణలు వచ్చాయి. రాయలసీమ లిఫ్ట్ పేరుతో రోజుకు 3 టీఎంసీల నీరు ఇచ్చినా కేసీఆర్ స్పందించలేదన్నారు. నదీ జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న కారణంగానే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గుర్తించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో గతంలో కంటే ఎక్కువ అన్యాయం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

కృష్ణాజలాల తరలింపు కోసం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ 1983లో ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు 11,150 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారని, వైఎస్‌ హయాంలో 40 వేల క్యూసెక్కులకు పెంచారన్నారు. 2020లో జీవో 203 ద్వారా పోతిరెడ్డి పాడు సామర్థ్యాన్ని 92 వేల 500 క్యూసెక్కులు పెంచామని, రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 3 టీఎంసీలు తరలించేందుకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. పోతిరెడ్డి పాడు నుంచి రోజుకు 8 టీఎంసీల నీరు తీసుకుంటున్నా బీఆర్‌ఎస్ ఎందుకు స్పందించడం లేదన్నారు. బీఆర్ఎస్ మొత్తం నదిని మళ్లిస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. 2020 మే 5న జీవో 203 విడుదల చేశారని, తెలంగాణకు నష్టం వాటిల్లుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. భవిష్యత్తులో నాగార్జున సాగర్ ఎండిపోతుందని హెచ్చరించారు. ముచ్చుమర్రి సామర్థ్యాన్ని 6500 క్యూసెక్కులు, కెసి కెనాల్ 1000 క్యూసెక్కులు, మల్యాల సమీపంలో 3000 క్యూసెక్కుల నుంచి 6000 క్యూసెక్కులకు పెంచినట్లు వివరించారు.

Read also: Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

తెలంగాణ ఏర్పడిన తర్వాత గతంలో కంటే అన్యాయం జరిగిందన్నారు. 2004 నుంచి 2014 వరకు 10665 టీఎంసీల్లో 727 టీఎంసీలు నాన్ బేసిన్ ప్రాంతాలకు వెళ్లాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1200 టీఎంసీలు నాన్ బేసిన్ ప్రాంతాలకు వెళ్లాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక యాభై శాతం ఆంధ్రాకు బదిలీ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలను కేటాయించినప్పుడు తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే 299 టీఎంసీల కేటాయింపునకు బీఆర్ ఎస్ పార్టీ ఆమోదం తెలిపిందని ఆరోపించారు.బచావత్ ట్రిబ్యునల్ అవార్డు తర్వాత ఆంధ్రాకు 500 టీఎంసీలకు పైగా నీళ్లు ఇచ్చారని, గత ఏడాది సగం నీళ్ల కోసం పోరాడారని వాపోయారు. 299 టీఎంసీల నీటి పంపిణీకి ఎందుకు అంగీకరించారో చెప్పాలన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ, ప్రధానంగా దక్షిణ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పరీవాహక ప్రాంతం, జనాభా, కరువు ప్రభావం ఆధారంగా ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు చేయాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.

2015 నుంచి ప్రతి ఏటా ఆంధ్రాకు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపునకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఢిల్లీ వెళ్లి ఆమోదముద్ర వేసింది. రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల కేటాయింపునకు బచావత్ ట్రిబ్యునల్ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఏపీకి 512 టీఎంసీలు ఇవ్వాలన్న నిర్ణయానికి ఎందుకు అంగీకరించలేదని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సాగునీటి విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.కృష్ణా బేసిన్‌లో అన్ని విధాలుగా ఎక్కువ నీరు తెచ్చుకునే హక్కు తెలంగాణకు ఉన్నప్పటికీ ప్రభుత్వ అసమర్థత వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ వాటా వచ్చిందన్నారు. టీఆర్‌ఎస్‌ ఆమోదం వల్లే కోర్టుల్లో ఆంధ్రుల వాదన ఉందన్నారు. టెలిమెట్రీ ఏర్పాటు చేయకపోవడంతో పోతిరెడ్డి పాడు నుంచి ఎంత నీటిని తరలిస్తున్నారో లెక్కలు వేయాల్సి ఉందన్నారు. ఆ డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. 2016 సెప్టెంబర్ 21న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఉమాభారతి సమక్షంలో కేసీఆర్, చంద్రబాబు ఏపీకి 512 టీఎంసీల కేటాయింపునకు ఆమోదం తెలిపారు.
Minister Ambati Rambabu: ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే.. ఆ తర్వాతే మూడు రాజధానులు..!