హైదరాబాద్ రాడిసన్ బ్లూ హోటల్‌లోని పబ్ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. శనివారం అర్ధరాత్రి పబ్‌లో రేవ్ పార్టీలో పాల్గొన్న సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కుమార్తె తేజస్విని చౌదరి కూడా ఉందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రేణుకా చౌదరి స్పందించారు. బార్, ఫుడ్డింగ్ అండ్ మింక్‌పై తన కుమార్తెపై వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆమె క్లారిటీ ఇచ్చారు. తన కుమార్తె తేజస్విని చౌదరిపై కొన్ని మీడియాల్లో వచ్చిన వార్తలను ఖండిస్తున్నట్లు రేణుకాచౌదరి పేర్కొన్నారు. అసలు పోలీసుల రైడింగ్ జరుగుతున్న సమయంలో పుడ్డింగ్ అండ్ మింక్ వద్ద తన కుమార్తె లేదన్నారు. పోలీసులు తన కుమార్తెను అదుపులోకి తీసుకోలేదని.. సెన్సేషనల్ రిపోర్టింగ్‌లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లను ప్రస్తావించి వారిని ఈ కేసులోకి లాగడానికి ముందు మీడియా సంస్థలు ప్రాథమిక పాత్రికేయ ప్రమాణాలను పాటించాలని హితవు పలికారు. వాస్తవాలను తెలుసుకుని వార్తలను ప్రసారం చేయాలని ఆశిస్తున్నట్లు రేణుకా చౌదరి తెలిపారు.
కాగా గతంలో బంజారాహిల్స్ రాడిసన్ హోటల్‌లో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌ను రేణుకాచౌదరి కుమార్తె తేజస్విని చౌదరి నిర్వహిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ పబ్ ఆయుర్వేదిక్ కాక్‌టైల్స్‌కు కేరాఫ్ అంటూ తేజస్విని చెప్పుకొచ్చారు. నో హ్యాంగోవర్ డ్రింగ్స్ సర్వ్ చేస్తామని, ఏ క్లాస్ కస్టమర్ల కోసమే స్పెషల్‌గా నడిచే పబ్ అంటూ పుడ్డింగ్ అండ్ మింక్ గురించి ఆమె చెప్పారు.