వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఐసీయూలో భీమారంకు చెందిన రోగి శ్రీనివాస్ కాళ్లు, చేతులను ఎలుకలు కొరికాయి. దీంతో రోగికి తీవ్రంగా రక్తస్రావం జరిగింది. ప్రస్తుతం రోగి శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. తక్షణమే విచారణకు ఆదేశించారు. అధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
మరోవైపు వరంగల్ అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్సవ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చి రోగి బంధువులతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఐసీయూలోకి ఎలుకలు ఎలా వచ్చాయనే విషయంపై అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్సవ ఆరా తీశారు. కాగా ఆసుపత్రిలో శానిటేషన్ పనులు సరిగా చేయకపోవడం వల్లే ఎలుకలు వస్తున్నాయని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో ఆస్పత్రిలో డ్రైనేజీ, పారిశుధ్య పనులను మెరుగుపర్చాలని అధికారులను అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు.