మద్యం కిక్కు నిషా నశాలనికి ఎక్కితే.. మేము చేసేదే రైట్.. మేము పోయేదే రూట్.. అడ్డొస్తే లైట్.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు మందుబాబులు.. పీకల దాక మద్యం సేవించి నిర్లక్ష్యంగా రోడ్లపై వాహనాలు నడుపుతూ.. అడ్డొచ్చిన వారిపైకి కూడా కార్లను ఎక్కించేస్తున్నారు. యమ స్పీడ్‌తో రయ్..రయ్‌మంటూ రోడ్లపై అడ్డొచ్చిన వారిని ఢీ కొట్టి.. లైట్ తీసుకో అంటూ వెళ్లిపోతున్నారు. భాగ్యనగరంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. అయితే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. కొండాపూర్ మసీద్ బండలో మందుబాబుల వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. బైక్‌ను ఢీ కొట్టారు.
దీంతో.. వారిని అడ్డగించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలలో ఒకరికి 501 పాయింట్లు రాగా, మరో వ్యక్తికి 234 పాయింట్స్ వచ్చింది. మద్యం మత్తులో పోలీసులను సైతం లేక్కచేయకుండా యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు ఆ యువకులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే.. మందుబాబులు నడిపిన కారుపై ఎంపీ స్టిక్టర్ ఉండడం గమనార్హం.