స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని గోషామహల్ ఎమ్మెల్యే, శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ రాజాసింగ్ ఆదివారం పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేతాజీ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా అనేక స్వాతంత్ర్య పోరాటాలు చేపట్టారని, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడానికి అనేకమంది స్ఫూర్తినిచ్చారన్నారు. దురదృష్టవశాత్తూ ఇలాంటి స్వాతంత్ర్య సమరయోధులను ప్రజలు మరిచిపోయేలా చేసింది కాంగ్రెస్’ అని రాజా సింగ్ ఆరోపించారు.
స్వాతంత్య్రం కోసం పోరాడిన పలువురు వ్యక్తుల త్యాగాలను స్మరించుకునేందుకు బీజేపీ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారని తెలిపారు. నేటి తరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసుకోవాలి. నేతాజీ స్ఫూర్తితో రాష్ట్ర బీజేపీ విభాగం టీఆర్‌ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతుందని రాజాసింగ్ అన్నారు.