Raja Singh Shows Anger On State Intelligent Over Bulletproof Vehicle: ఇంటెలిజెన్స్ అధికారులు తనకిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మీద ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల నుంచి తనకు ముప్పు పొంచి ఉందని తెలిసి కూడా.. తరచూ మరమ్మత్తులకు గురయ్యే వాహనాన్ని ఇచ్చారంటూ ఆయన మండిపడ్డారు. కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు తనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారని, అది 4 నెలల క్రితం రోడ్డు మధ్యలోనే ఆగిపోయిందని వాపోయారు. అప్పుడు తాను ఆ వాహనాన్ని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి తిరిగి పంపించానన్నారు. మరమ్మత్తులు చేసి మళ్లీ అదే వాహనాన్ని ఇచ్చారని, 2 నెలల క్రితం నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లే సమయంలో కూడా అది ఆగిపోయిందని పేర్కొన్నారు. ఆ టైంలో గన్‌మెన్ల సాయంతో తనని ఆటోలో కోర్టుకు తీసుకెళ్లారన్నారు.
అంతేకాదు.. అఫ్జల్‌గంజ్ వద్ద కూడా ఆ వాహనం మరోసారి ఆగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో మరోదారి లేక, తన సొంత వాహనాన్నే రప్పించుకొని వెళ్లానన్నారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న తనకు.. ఇంటెలిజెన్స్ అధికారులు ఇలాంటి వాహనం ఇస్తారా? అని రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు. కండీషన్‌లో లేని వాహనంలో తనకు ఏమాత్రం భద్రత ఉంటుందనే విషయాన్ని తాను పోలీసు అధికారులు దృష్టికి గతంలో చాలాసార్లు తీసుకెళ్లినా.. అధికారులు స్పందించలేదని ఆయన ఆవేదన చెందారు. కాగా.. పీడీ యాక్ట్ కేసులో ఇటీవల బైలుపై రాజాసింగ్ జైలు నుంచి రిలీజైన సంగతి తెలిసిందే! ఎలాంటి ప్రెస్‌మీట్‌లు ఇవ్వకూడదని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని, ర్యాలీలు కూడా నిర్వహించకూడదన్న షరతులతో ఆ బైలుని మంజూరు చేసింది.
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ షోను హైదరాబాద్‌లో నిర్వహించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ.. రాజాసింగ్ ఒక వీడియోని విడుదల చేశారు. అది ఓ వర్గానికి చెందిన వ్యక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో, దేశవ్యాప్తంగా దుమారం రేగింది. అప్పుడు విద్వేష వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. దీనికి సవాల్ చేస్తూ రాజాసింగ్ సతీమణి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ని విచారించిన కోర్టు.. వాదోపవాదనలు విన్నాక షరతులతో కూడిన బెయిల్‌ని రాజాసింగ్‌కి మంజూరు చేసింది.