Rain in Warangal: చిన్నగా ప్రారంభమైన గాలి దుమారం క్రమంగా బీభత్సాన్నే సృష్టించింది. వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల్లో శనివారం రాత్రి అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అకాల వర్షంతో వరంగల్ నగరంతో పాటు నర్సంపేట, నల్లబెల్లి, చెన్నారావుపేట మండలాల్లో ప్రజలు వణికిపోయారు. వరంగల్ తూర్పులోని కాశీబుగ్గ గాంధీనగర్, చింతల్, జేబీనగర్, ఆర్‌ఎస్‌నగర్, చార్‌బౌలి తదితర ప్రాంతాల్లో 150 ఇళ్ల పైకప్పులు, రేకులు ఎగిరి పోయాయి. సుమారు 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 50 స్తంభాలు కింద పడి విద్యుత్తు సరఫరా ఆగింది. వందల విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. కొన్నిచోట్ల ఇళ్లపై పడ్డాయి. పలుప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. నల్లబెల్లి మండలంలో వర్షానికి ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. పలు ఇళ్ల పైకప్పు రేకులు గాలికి ఎగిరిపోయి మొండిగోడలు మిగిలాయి. బాధితులు బోరున విలపిస్తున్నారు. ఈనేపథ్యంలో.. బల్దియా డీఆర్‌ఎఫ్ టీం ఎంట్రీ ఇచ్చింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా.. కాశీబుగ్గ, ఓ సిటీ, ఖిలావరంగల్, చింతల్ మైసమ్మ గుడి వద్ద కూలిన వృక్షాలు, చెట్లను తొలగించాయి.
Read also: Karnataka: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రజలకు వరాల జల్లు
చార్‌బౌలి, నిజాంపురాలో విద్యుత్ వైర్లు తెగి పడటంతో రెండు గంటల పాటు శ్రమించి పునరుద్ధరించారు. ఇక ఎనుమాముల మార్కెట్ సమీపంలో ఒక జిన్నింగ్ మిల్లు ప్రహరీ కూలి.. ఇనుప రేకులు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. మిల్లులోని పత్తి, పత్తిగింజలు తడిసిపోయాయి. రూ.10 లక్షలు వరకు నష్టం వాటిల్లి ఉంటుందని మిల్లు నిర్వాహకుడు శ్రీమన్నారాయణ తెలిపారు. మార్కెట్‌లోని అపరాల షెడ్లు కింద ఉన్న వ్యాపారుల సరకును ఖాళీ చేయకపోవడంతో.. స్థలం లేక ఆరుబయట ఆరబోసిన మక్కలు తడిసిపోయాయి. నల్లబెల్లి మండలంలో ధాన్యం వరద నీటిలో కొట్టుకు పోయాయి. లెంకాలపల్లి, రంగాపురం గ్రామాల్లో వడగళ్లు పడ్డాయి. పలు గ్రామాల్లో చెట్లు కూలిపోయాయి. కరెంటు స్తంభాలు పడిపోవడంతో నల్లబెల్లి, లెంకాలపల్లి, రుద్రగూడెం, రంగాపురం, శనిగరంతో పాటు పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచి పోయింది. అయితే శనివారం రాత్రి మేయర్ గుండు సుధారాణి, ఉపమేయర్ రిజ్వానా షమీమ్ చింతల్, జేబీనగర్, ఆర్‌ఎస్‌నగర్‌లో పర్యటించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో మాట్లాడి భోజనం ఏర్పాట్లు చేయించారు. ప్రభుత్వ పరంగా సాయం అందించేలా చూస్తామన్నారు.
Virupaksha: వంద కోట్ల సినిమా ఒటీటీలోకి వచ్చేసింది… స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?