బంగాళాఖాతంలో రుతుపవనాలు విస్తరించి ఉన్న ప్రాంతం నుంచి తమిళనాడు వరకు గాలులతో 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ పలు ప్రాంతాల్లో జల్లులు కురిశాయి.
రానున్న ఐదు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి” అని తెలిపింది. “ఉదయం ఉష్ణోగ్రతలు పెరిగి, సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతుంటాయని వెల్లడించింది. అప్పటి వరకు ఉష్ణోగ్రత 32 నుంచి 40 డిగ్రీల మధ్య ఉంటుంది. అలాగే హైదారాబాద్లోనూ అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
ఇక సంగారెడ్డి జిల్లా మల్చెల్మలో అత్యధికంగా 3.3 సెంటీమీటర్ల వర్షం కురవగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మద్దుకూరులో అత్యల్పంగా 1.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు, కొన్ని ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు తెలిపారు.
కాగా, కన్నూర్, పాలక్కాడ్ పరిసర ప్రాంతాల గుండా రుతుపవనాలు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కేరళలోని మిగిలిన భాగాలు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాల కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలలో రాబోయే 3-4 రోజుల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి ఉత్తర కేరళ, కర్ణాటక తీరం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు కేరళ, తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉండటంతో.. రాబోయే రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.