విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై డిస్కమ్స్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాయా? ఈఆర్సీకి టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించడంలో ఎందుకు ఆలస్యం జరుగుతోంది?గడువులోగా టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించకుంటే ఈఆర్సీ ఏం చేస్తుంది?
వార్షిక విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించే విషయంలో విద్యుత్ పంపిణీ సంస్థలు కాలయాపన చేస్తున్నాయి. వాస్తవానికి నవంబర్ 31లోపు ఈఆర్సీకి డిస్కమ్స్ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే గడిచిన మూడేళ్ళ టారిఫ్ ప్రతిపాదనలు సైతం సమర్పించకుండా కారణాలు చెబుతూవచ్చాయి. విద్యుత్ నియంత్రణ మండలి కూడా కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో డిస్కమ్స్‌కు అవకాశం ఇస్తూ వచ్చారు. ఇప్పుడు సమయం ఇవ్వకూడదని ఈఆర్సీ నిర్ణయించింది. దీనికి తోడు టారిఫ్ ప్రతిపాదనలు ఎంత ఆలస్యమైతే అంత అపరాధ రుసుం వసూలు చేయాలని…అందుకు తగిన సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించింది.
విద్యుత్ సంస్కరణల్లో ఉత్తరప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలను తెలంగాణ ఈఆర్సీ కూడా అనువర్తింప చేయాలని నిర్ణయం తీసుకుంది. విద్యుత్ చట్టం, ఎలక్ట్రిసిటీ టారిఫ్ నిబంధనల ప్రకారం.. డిస్కంలు ఏటా నవంబర్ 31లోగా తర్వాతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను ఈఆర్సీలకు సమర్పించాలి.
ఐతే…చాలా రాష్ట్రాల్లో ఈ నిబంధన అమలు కావడం లేదు. విద్యుత్ చార్జీలు పెంచితే వచ్చే ప్రజా వ్యతిరేకత, విపక్షాల విమర్శలు వంటి కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాలు చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించేందుకు డిస్కంలకు అనుమతి ఇవ్వడం లేదు. తెలంగాణలో సైతం గడిచిన ఐదేళ్లుగా విద్యుత్ చార్జీలు పెంచలేదు. డిస్కంలు ఏటా ప్రతిపాదనలను సిద్ధం చేసుకున్నా..ప్రభుత్వం నుంచి అనుమతి రాక ఈఆర్సీకి సమర్పించలేదు. చార్జీలు పెంచకపోవడంతో డిస్కంలపై భారం పెరిగి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. చాలా రాష్ట్రాల్లో దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది.
ఇక…దీనిపై…ఇటీవల జరిగిన ఓ సదస్సులో ఈఆర్సీల చైర్మన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని నివారించడం కోసం భారీగా జరిమానాలు విధించేలా కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ఈఆర్సీ కొత్త నిబంధనలను ప్రకటించింది. డిస్కంలు వార్షిక టారిఫ్ పెంపు ప్రతిపాదనలు, వార్షిక ఆదాయ అవసరాల నివేదిక, మల్టీ ఇయర్ టారిఫ్ ప్రతిపాదనలు, ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలను నిర్దేశిత గడువులోగా సమర్పించకుంటే..రోజుకు 5000 చొప్పున తొలి 30 రోజులు జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది. 30 రోజుల తర్వాత రోజుకు 10 వేలతో పాటు అదనంగా లక్ష రూపాయల జరిమానా విధిస్తామని తెలిపింది. డిస్కంలు ఇలా చెల్లించే జరిమానాలను వినియోగదారుల నుంచి వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది.
తెలంగాణలోనూ ఇలాంటి నిబంధనలను అమల్లోకి తెచ్చే దిశగా ఈఆర్సీ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే కొత్త నిబంధనలకు సంబంధించిన ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.