తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మానవత్వపు విలువలు మరచి, ఆస్తి కోసం సొంత బంధాన్నే అడ్డుకున్నాడు ఓ వ్యక్తి. ఆస్తికోసం దత్తపుత్రుడి హక్కును సొంత సోదరుడు అడ్డుకున్నాడు. అంత్యక్రియలు నిర్వహించే హక్కుపై ఆస్తి వివాదం కారణంగా దత్తపుత్రుడిని అతని సొంత సోదరుడే అడ్డుకోవడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. చివరకు ఆస్తిలో వాటా కోసం పట్టుబట్టిన దత్తపుత్రుడి సోదరుడు.. అంత్యక్రియలను పూర్తి చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే…
జగిత్యాల పట్టణంలోని ఉప్పరిపేటలో గత రాత్రి బీమ్ రావు (85) అనారోగ్యంతో మృతి చెందాడు. బీమ్ రావుకు సంతానం లేకపోవడంతో తన సోదరుడి కుమారుడు సత్యనారాయణ అనే వ్యక్తిని దత్తత తీసుకున్నాడు. సత్యనారాయణకు సొంత సోదరుడు రాజేశ్వర్ రావు ఉన్నాడు. బీమ్ రావు అంత్యక్రియలకు దత్తపుత్రుడైన సత్యనారాయణ సిద్దమవగా.. రాజేశ్వర్ రావు అడ్డుపడ్డాడు. ఆస్తిపై కన్నేసిన రాజేశ్వర్ రావు.. అంత్యక్రియలను అడ్డుకున్నాడు. నువ్వు దత్తపుత్రుడివి అయినంత మాత్రాన ఆస్తి మొత్తం నీకే దక్కదు అని, మనం అన్నదమ్ములం (సత్యనారాయణ, రాజేశ్వర్ రావు) కాబట్టి ఆస్తులలో ఇద్దరికీ వాటా ఉంటుందని రాజేశ్వర్ రావు తన సోదరుడు సత్యనారాయణతో వాగ్వాదంకు దిగాడు.
Also Read: Shubman Gill: శుభ్‌మన్ గిల్ ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చిన బీసీసీఐ!
రాజేశ్వర్ రావు ఆస్తి వివాదాన్ని తెరపైకి తెచ్చి బీమ్ రావు అంత్యక్రియలకు అడ్డుపడ్డాడు. పెద్దలు ఎంత చెప్పినా అతడు వినలేదు. ఆస్తిలో వాటా కోసం పట్టుబట్టిన రాజేశ్వర్ రావే దివంగత బీమ్ రావు అంత్యక్రియలను పూర్తి చేశాడు. దాంతో సత్యనారాయణ కన్నీటి పర్యంతం అయ్యాడు. తండ్రికి కొరివి పెట్టే హక్కు దత్తపుత్రుడికి దక్కకుండా.. సొంత సోదరుడి ఆస్తి పంపకాల డిమాండ్ నెరవేరిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి ముందు అనుబంధాలు చిన్నబోయిన తీరుపై ఉప్పరిపేటలో విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై సత్యనారాయణరావు కూతురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.