Ponnam Prabhakar : హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రైవేట్ హాస్పిటల్స్‌ను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడం పేద ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మానవీయ కోణంలో హాస్పిటల్ యాజమాన్యాలు వెంటనే వెనక్కి తగ్గి, ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకువచ్చిందని చెప్పారు. ఐదు లక్షల ఉచిత వైద్య పరిమితిని పది లక్షలకు పెంచడంతో పాటు, గత 21 నెలల్లో ₹1,779 కోట్లు ప్రైవేట్ హాస్పిటల్స్‌కి చెల్లించిందని వివరించారు.
ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాతే 1,375 వైద్య చికిత్సల చార్జీలు సగటున 22% పెంచబడినట్లు, అలాగే కొత్తగా 163 ఖరీదైన వైద్య సేవలు ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు మంత్రి గుర్తుచేశారు. దీంతో పేదలకు మరింత వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ కొత్త ప్యాకేజీల వల్లే ప్రభుత్వం అదనంగా ₹487.29 కోట్లు ఖర్చు చేస్తోందని వివరించారు. 2014 నుంచి 2023 నవంబర్ వరకు సగటున నెలకు ₹57 కోట్లు చెల్లించగా, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు సగటున నెలకు ₹75 కోట్లు చెల్లించినట్లు మంత్రి వివరించారు.
ఇప్పటికే రెండు రోజుల్లోనే ₹100 కోట్లు ప్రైవేట్ హాస్పిటల్స్ ఖాతాలో జమ చేసినట్లు కూడా తెలిపారు. పెండింగ్ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ హాస్పిటల్స్ మానవీయ కోణంలో ఆలోచించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ సేవలు పేదలకు ప్రాణాధారం కావడంతో, వాటిని వెంటనే పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.
Little Hearts : ఆ విషయంలో మౌళిని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాల్సిందే..