Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన మంత్రి పొంగులేటి..

  • జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ప్రారంభం
  • పాత లబ్ధిదారులకు మరో అవకాశం కల్పించిన ప్రభుత్వం
  • ఫారెస్ట్-రెవెన్యూ భూముల వివాదాలపై ప్రత్యేక చర్యలు
  • అసైన్డ్ ల్యాండ్స్, సాదాబైనామా సమస్యలకు పరిష్కారంపై హామీ
Indiramma Houses

Indiramma Houses

Ponguleti Srinvias Reddy : తెలంగాణలో సొంతింటి కల కలిగిన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఆదిలాబాద్ జిల్లా వేదికగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘ఇందిరమ్మ ఇళ్ల’ రెండో విడత కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శనివారం మీడియాతో జరిపిన ప్రత్యేక చిట్‌చాట్‌లో ఆయన ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక రెవెన్యూ సమస్యలపై స్పష్టతనిచ్చారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పాత ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌లో లబ్ధిదారులుగా ఉండి, రకరకాల కారణాల వల్ల ఇప్పటివరకు ఇళ్లు పూర్తి చేసుకోని వారికి ఈ విడతలో ప్రభుత్వం మరో అద్భుతమైన అవకాశం కల్పించబోతోందని మంత్రి పొంగులేటి ప్రకటించారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేదే ప్రభుత్వ ఆశయమని, నిబంధనల ప్రకారం పెండింగ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు వీలుగా లబ్ధిదారులకు తగిన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

రెవెన్యూ శాఖలో ప్రజాప్రతినిధులు ప్రధానంగా మూడు రకాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని, వాటి పరిష్కారానికి యుద్ధప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా అటవీ (ఫారెస్ట్) , రెవెన్యూ భూములకు సంబంధించిన బోర్డర్ వివాదం సుదీర్ఘకాలంగా నడుస్తోందని గుర్తు చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తక్షణమే సరిహద్దులను (Borders) ఖరారు చేయాలని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్లకు (DFO) ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా అత్యాధునిక రోవర్ల (Rovers) సహాయంతో అటవీ భూములను పూర్తిస్థాయిలో సర్వే చేసి, ఆ నివేదికను సంబంధిత జిల్లా కలెక్టర్లకు సమర్పించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

రాష్ట్రంలో అసైన్డ్ భూములకు సంబంధించిన పట్టాలు చేతిలో ఉండి, క్షేత్రస్థాయిలో సాగు చేసుకోవడానికి భూమి లేని నిర్పేదలను గుర్తించి, వారికి తగిన భూమిని చూపించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు సూచించినట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. దీంతో పాటు రెవెన్యూ ప్రైవేట్ ల్యాండ్స్ సమస్యలపై కూడా ప్రజాప్రతినిధులు కోరిన విధంగా త్వరలోనే సరైన పరిష్కారం చూపిస్తామన్నారు. సామాన్యులకు ఎంతో కాలంగా భారంగా మారిన సాదాబైనామా (రిజిస్ట్రేషన్ లేని సాదా కాగితాల లావాదేవీలు) అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ‘భూ భారతి’ పోర్టల్‌లో చేర్చిందని, ఈ పెండింగ్ భూ సమస్యలన్నింటినీ అతి త్వరలోనే పూర్తిస్థాయిలో పరిష్కరించి రైతులకు, భూ యజమానులకు ఊరట కలిగిస్తామని మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.