ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతుంటాయి. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్ లోకి వచ్చినవారు, టీఆర్‌ఎస్ పార్టీలోనే వున్నవారు అనే రెండు వర్గాలు ఆధిపత్యం కోసం తపిస్తుంటాయి. తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నేను పార్టీ మారుతున్నాననేది అవాస్తవం అని కొట్టి పారేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మునిగేపల్లి లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ మారుతున్నానంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తమ ఇమేజ్ కోసమే కొంతమంది వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Read Also: Liquor: మందుబాబులకు అలెర్ట్.. 24 గంటల పాటు మద్యం షాపులు బంద్
టీఆర్‌ఎస్ పార్టీతోనే తాను వుంటానన్నారు. టీఆర్ఎస్ మెడలు వంచామన్న బీజేపీ నాయకుల మాటలకు జనాలు నవ్వుకుంటున్నారన్నారు. బండి సంజయ్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ అంత పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందని ఆయన చెప్పారు. కేటీఆర్ ఖమ్మం వస్తున్నారని మా ఇంటి దగ్గర భోజనం చేస్తారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైతులకు అన్నివిధాలుగా న్యాయం చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ ఒక్కటే అన్నారు.