Site icon NTV Telugu

Ponguleti Srinivas Reddy : కాళేశ్వరం అద్భుతం కాదు.. అపహాస్యం

Ponguleti

Ponguleti

తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక విషం చిమ్ముతున్నారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టుల అవినీతిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచంలోనే ఎనిమిదో అద్భుతంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కమిషన్ల కోసమే కట్టారని పొంగులేటి ఆరోపించారు. “38 వేల కోట్లతో పూర్తి కావాల్సిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పక్కనపెట్టి, తమ రాచరికాన్ని చాటుకోవడం కోసం లక్షల కోట్లతో కాళేశ్వరం నిర్మించారు. తీరా చూస్తే ఎన్నికల ముందు ఆ ప్రాజెక్టు పేకమేడలా కూలిపోయింది” అని ఎద్దేవా చేశారు. గత నాలుగేళ్లలో 162 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తే, అందులో 50 టీఎంసీలు తిరిగి సముద్రం పాలయ్యాయని ఆయన గణాంకాలతో వివరించారు.

కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ కోరినప్పటికీ, బీఆర్ఎస్ , బీజేపీల మధ్య ఉన్న అంతర్గత ‘ఫెవికల్’ బంధం వల్లే విచారణ ముందుకు సాగడం లేదని మంత్రి ఆరోపించారు. కేంద్ర సంస్థల నివేదికల ఆధారంగానే తాము జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేశామని, కానీ దీనిపై అసెంబ్లీలో చర్చ జరిగే సమయంలో ప్రతిపక్ష సభ్యులు పారిపోయారని దుయ్యబట్టారు.

“సభలో చర్చకు రమ్మంటే కుంటిసాకులు చెప్పే బావబావమరుదులు (కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి), బయట మాత్రం అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలు వేస్తున్నారు” అని పొంగులేటి ఘాటుగా విమర్శించారు. నిత్యం పెయిడ్ ఆర్టిస్టులతో సోషల్ మీడియాలో విషం చిమ్ముతూ, శవాల మీద చిల్లర ఏరుకునే రకంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజలు వీరి నిజస్వరూపాన్ని చూశారు కాబట్టే అన్ని ఎన్నికల్లో ఓడగొట్టారని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడదని మంత్రి స్పష్టం చేశారు. కృష్ణా పరివాహక ప్రాంత నీటిని నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ వాసులకు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ స్వార్థ నిర్ణయాల వల్ల రాష్ట్రం 15 ఏళ్లు వెనక్కి పోయిందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని మరో 15 ఏళ్లు ముందుకు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పనులపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్షం దమ్ముంటే అసెంబ్లీకి రావాలని ఆయన సవాల్ విసిరారు.

Captaincy On The Edge: ఆ ఐదుగురు కెప్టెన్ల మెడ మీద కత్తులు.. ఒక్క ఓటమి చాలు, కెరీర్ క్లోజ్!

Exit mobile version