Site icon NTV Telugu

Ponguleti Srinivas Reddy : శంకుస్థాపనలు మీవి.. పనులు మావి.!

Minister Ponguleti

Minister Ponguleti

బీఆర్ఎస్ నాయకత్వంపై , గత ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. మహబూబాబాద్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూనే, ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినప్పటికీ, ప్రతి రూపాయిని పొదుపు చేస్తూ పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. “గత ప్రభుత్వం కేవలం శంకుస్థాపనలకే పరిమితమైంది తప్ప, పనుల కోసం నిధులు కేటాయించలేదు. కానీ మా ప్రజా ప్రభుత్వం మాటల కంటే చేతలకు ప్రాధాన్యత ఇస్తోంది” అని ఆయన స్పష్టం చేశారు.

Siriలోకి Gemini పవర్.. Googleతో Apple భారీ AI ఒప్పందం.!

పదేళ్ల కుటుంబ పాలనలో రాష్ట్రాన్ని ఆగమాగం చేశారని పొంగులేటి మండిపడ్డారు. కనీసం లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేకపోయిన బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. “దశాబ్ద కాలంలో పేదలకు ఒక చిన్న ఇల్లు కూడా ఇవ్వలేని వారు, ఈరోజు మాట్లాడుతున్నారు. మేం పార్టీలతో సంబంధం లేకుండా, అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లు నిర్మిస్తున్నాం” అని ఆయన వివరించారు.

కేటీఆర్ చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. మాయ మాటలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన వారు, మళ్ళీ అధికారం కోసం పిచ్చి వేషాలు వేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలను సెమీఫైనల్ అని అంటున్న కేటీఆర్ కు, “రా.. ఈ గేమ్ ఆడదాం” అంటూ బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామంటే ఎవరూ చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఒక్కో నియోజకవర్గం మూడు జిల్లాల్లో విస్తరించి ఉండటం వల్ల పరిపాలన పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని, నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజల మధ్యే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టబోమని మంత్రి తేల్చి చెప్పారు. చివరగా, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Saudi: సౌదీలో భారతీయ మహిళ హత్య.. ఎవరు చంపారంటే..!

Exit mobile version