ఢిల్లీలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఒక్కో కార్పొరేటర్ ను పరిచయం చేసుకున్నారు ప్రధాని. 47 మంది కార్పొరేటర్లు తెలంగాణ ఎమ్మెల్యే స్థాయిలో పోరాటం చేయాలని సూచించారు మోదీ. వచ్చే ఎన్నికల కోసం బాగా పని చేయాలని కార్పొరేటర్లకు సూచించారు. ఒక్కో కార్పొరేటర్ తో మాట్లాడుతూ.. వారి కుటుంబ పరిస్థితి, పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. కార్పొరేటర్లుగా పనితీరు ఎలా ఉందని ఆరా తీశారు. వీరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఇటీవల హైదరాబాద్ వచ్చిన సమయంలో కార్పొరేటర్లను కలవలేకపోయానని మోదీ అన్నారు. కార్పొరేటర్ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారని ప్రధాని అడిగారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా..? లేదా..? అని ఆరా తీశారు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని కార్పొరేటర్లకు ప్రధాని మోదీ సూచించారు. ఇదే విధంగా హైదరాబాద్ లో వచ్చే నెల జరగబోతున్న కార్యవర్గ సమావేశాలపై ఆరా తీశారు. మళ్లీ హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తా అని మాట ఇచ్చారు. ఇదే సమయంలో హైదరాబాద్ వచ్చినప్పుడు భాగ్యలక్ష్మీ ఆలయాన్ని సందర్శించాలని కార్పొరేటర్లు కోరగా.. తప్పకుండా చూద్ధాం అని ప్రధాని మోదీ బదులిచ్చారు. వచ్చేఎన్నికల్లో భాగంగా తెలంగాణలో గెలిచేలా కార్పొరేటర్లకు ప్రధాని మోదీ దిశానిర్ధేశం చెేసినట్లు తెలుస్తోంది. కార్పొరేటర్లతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ కే. లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు.