కొంత మంది వ్యక్తులు నయా దందాలకు తెరలేపుతున్నారు. ఈజీగా మనీ సంపాదించుకునేందుకు పోలీసులు , మరికొందరు రవాణా శాఖాధికారులు , ఇంకొందరు విజిలెన్స్ , ఏసీబీ పేరుతో బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు గతంలోకూడా వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి దందాలకు పాల్పడిన వారిలో కొందరు జైలు పాలయ్యారు కూడా. కానీ.. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగకుండా దళారుల అవతారమెత్తుతున్నారు.
బెదిరింపులు.. వసూళ్లు
పట్టణాలు, నగరాల్లో మరో రకం దళారులు పుట్టుకొచ్చారు. ఎవరైనా ఇల్లు, లేదా అపార్టుమెంట్, లేదా ఇతర నిర్మాణాలు చేసిన సమయంలో.. ముందుగా వారి వద్దకు వెళ్లి.. ‘నీవు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేస్తున్నావు.. నాకు ఏం ఇస్తావో చెప్పు.. లేకుంటే అన్ని విభాగాల అధికారులకు ఫిర్యాదు చేస్తా” అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కొంత మంది గొడవెందుకులే.. అనుకొని ఎంతో కొంత సర్దుబాటు చేసి పంపిస్తుండగా, ఇంకొందరు వారి మాటలను తిప్పికొడుతున్నారు. దీంతో.. సదరు వ్యక్తులు ఆకాశరామన్న పేరుతో అధికారులకు లేఖలు రాస్తూ ఫిర్యాదు చేస్తున్నారు.
ఎవరైనా ఒక్క అధికారి వెళ్లినా సరే దానిని ఆధారంగా చేసుకొని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిర్మాణాల విషయంలోనూ అనుమతులు తెస్తామంటూ కొందరు దళారులు మాయమాటలు చెప్పి దోచుకుంటున్నారు. అలాగే, పట్టాభూముల్లో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అసలు యజమానిని బెదిరించి డబ్బుల వసూళ్లకు దిగుతున్నారు. లేదా ఆక్రమించడం.. క్షేత్రస్థాయిలో గొడవలు చేయడం తద్వారా ఏదో విధంగా కొన్ని డబ్బులు వసూళ్లు చేయడం. నిజానికి సంబంధిత దళారుల్లో నూటికి 95 శాతం మందికి అధికారులెవరూ తెలియదు. కేవలం ఎదుటి వ్యక్తి బలహీనత, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఆడుతున్న డ్రామాలు. వీటి వల్ల అధికారులు బదనాం అయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.
పకడ్బందీ చర్యలు
నిజానికి దళారులు, మోసకారుల పని పట్టేందుకు ఒకవైపు కరీంనగర్ కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ అనేక చర్యలు చేపడుతున్నారు. ఏ విషయంలోనూ దళారుల మాటలు నమ్మవద్దని చెబుతున్నారు. ఏదైనా అవసరం ఉంటే సంబంధిత అధికారులను కలిసి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలి తప్ప.. మధ్యవర్తులను ఆశ్రయించ వద్దని పదేపదే ప్రకటనలు జారీ చేస్తున్నారు.
దౌర్జన్యంగా భూముల ఆక్రమణలకు పాల్పడినా, లేదా డబ్బుల వసూళ్లకు పాల్పడినా వారిపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుదారుడి కోరిక మేరకు.. అవసరమైతే పేర్లు బయట పెడుతామని, లేదంటే విచారణ చేసి.. సంబంధిత దళారులపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సీపీ వీ. సత్యనారాయణ ప్రకటించిన విషయం తెలిసిందే..
అలాగే, ప్రభుత్వ పథకాల నుంచి మొదలు ఇతర ఏ అంశాల్లోనూ దళారుల మాటలు నమ్మవద్దని, దళితబంధు, డబుల్‌బెడ్రూం ఇండ్లు, నిర్మాణాల అనుమతులన్నీ నిబంధనల ప్రకారమే ఉంటాయని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ఇప్పటికే ప్రకటించారు. ఇలాంటి వాటి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే.
Shocking Survey: ఏపీలో సైకో భర్తలు.. టార్చర్ పెట్టడంలో నెం. 1 అంట అంట